మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు!
అమరావతి: రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా అవకాశం కల్పించాం. అయినా మీ పనితీరు మెరుగుపడలేదు. మీ తండ్రిని దూరం పెట్టాలని చెప్పాం కదా’ అని మంత్రిని చంద్రబాబు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉండవల్లిలో బుధవారం రాత్రి సమీక్షించారు. దీనికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. పార్టీకి కంచుకోటలాంటి జిల్లాలో వ్యక్తిగతంగా, పార్టీపరంగా ప్రగతి చూపాలని, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని కొండపల్లికి సీఎం సూచించారు. దీనిపై కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ…ఆరు నెలలుగా తన తండ్రి ఏ వ్యవహారంలోనూ జోక్యం చేసుకోవడం లేదని ఈ సందర్భంగా బదులిచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే…జిల్లాల వారీగా టీడీపీ ప్రజా ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి, వారివారి పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తారని కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అటజడి మొదలైంది. పనితీరు సరిగాలేని మంత్రులపై వేటు తప్పదని వార్తలు ఇంతకు ముందే వినిపించాయి. ఆ కార్యాచరణను సమీక్షలతో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.


