సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న
న్యూదిల్లీ: నిర్బంధాలు, బెదిరింపులు, ఒత్తిడుల నీడలో మీడియా తన కార్యకలాపాలు సాగించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. పత్రికా స్వాతంత్య్రానికి ఎదురవుతున్న ముప్పు ప్రత్యక్ష సెన్సార్‌షిప్ నుంచి కాక.. ప్రభుత్వ నియంత్రణలు, యాజమాన్య నిబంధనలు, లైసెన్సింగ్ చట్టాలు, ఆర్థిక విధానాల నుంచి తలెత్తుతోందని ఆమె ‘‘ఐపీఐ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ జర్నలిజం’’ అవార్డు ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. పత్రికా రంగాన్ని కబళించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పర్యవసానాలు ఆర్థికంగానే కాక రాజకీయంగానూ ఉంటున్నాయని జస్టిస్ నాగరత్న అన్నారు. ‘‘ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతి మీడియా సంస్థకు చట్ట ప్రకారం స్వేచ్ఛ ఉంది. కానీ ప్రభుత్వం విధించగల ఆర్థిక పరిమితుల నేపథ్యంలో అలా విమర్శిస్తే మీడియా సంస్థ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయి’’ అని న్యాయమూర్తి అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకుర్, పీటీఐ వార్తాసంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ జోషిలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.


