* స్వచ్ఛందంగా స్కూళ్ల బంద్
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఆదోని ప్రత్యేక జిల్లా సాధన లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బంద్‌కు పెద్దకడబూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దకడబూరులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ తాలూకా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక జిల్లా అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన పరిపాలనతోపాటు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధన ఉద్యమానికి తమ సంఘం ప్రారంభం నుంచే మద్దతుగా నిలుస్తోందని, ఈ బంద్ ద్వారా ప్రజలలో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయానికి మండలంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పిలుపునకు అనుగుణంగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడం ద్వారా ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని విశ్వనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ నాయకులు గోవిందరెడ్డి, శేఖర్, ఉసేని, పరుశురాం తదితరులు పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


