–జిల్లా నాయకులు బోయ మునుస్వామి
–తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉల్లి, టమోటా, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా నాయకులు బోయ మునుస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు, ఎర్రపురుగు కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని, ఉల్లి–టమోటా పంటలు బాగా పండినప్పటికీ మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరా ఉల్లి పంటకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి వస్తుందని, కానీ ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ధర రూ.200–500కే పరిమితమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 ధర సరిపోదని, కనీసం రూ.3000 చొప్పున మార్కెట్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టమోటా పంటకు కూడా ధరలు లేక రైతులు పంటలను రోడ్లపై పారబోసే పరిస్థితి ఏర్పడిందని, కనీసం కిలో రూ.20 మేరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం తాసిల్దార్ రామేశ్వర రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు అంజన్నయ్య, ఈరన్న, జ్ఞానయ్య, నరసప్ప, ప్రమోద్ కుమార్, లక్ష్మన్న, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.


