జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : నిన్న అక్టోబర్ 14న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై షెడ్యూల్ విడుదల అయిందని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినదని, ఎన్నికల ప్రక్రియను నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో నిష్పక్ష పాతంగా చేపట్టాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని జిల్లా పరిషత్ డిపిఆర్సి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, మండల ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఆర్ఓ, ఎఆర్ఓలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ సాధారణ ఎన్నికలు ఎంపిటిసి, జడ్పీటీసీ – 2026కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మాత్రమే ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని, సొంతంగా నిర్ణయాలు, ఊహలకు తావు ఇవ్వరాదని ఆర్ఓ, ఎఆర్ఓలను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు ఎన్నికల నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలు, రూల్బుక్ను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికలపై అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.*
జిల్లా పరిషత్ సిఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమింపబడిన అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా ఆర్ఓ, ఎఆర్వోలు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -


