ఎఫ్‌బీఐ దర్యాప్తు రోజునే 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్ లైంగిక దుర్వినియోగ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అమెరికా న్యాయశాఖ తాజాగా మరికొన్ని కీలక పత్రాలను (ఎప్‌స్టీన్ ఫైల్స్) బహిర్గతం చేసింది.
ఈ పత్రాల్లో షాక్‌కు గురిచేసే అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో 2018లో ఎఫ్‌బీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిన రోజునే ఎప్‌స్టీన్ భారీగా 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.దీనికి సంబంధించిన ఆధారాలు ఫైల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి.
అంతేకాదు, 55 గ్యాలన్ల సామర్థ్యం గల సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్‌ను 2018 జూన్ 12న ఎప్‌స్టీన్‌కు చెందిన లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపానికి పంపించినట్లు అతడి ఈమెయిల్స్‌లో ఉన్న రసీదు ద్వారా తెలుస్తోంది.
ద్వీపంలో ఉన్న ఆర్వో నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు
దర్యాప్తు అధికారుల చేతికి కీలకఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఎప్‌స్టీన్ ఉద్దేశపూర్వకంగానే సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆమ్లాన్ని ఉపయోగించి సాక్ష్యాలను లేదా మానవ అవశేషాలను పూర్తిగా నాశనం చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా కొన్ని నివేదికల్లో ప్రస్తావనకు వచ్చాయి.అయితే మరో కోణంలో చూస్తే,తన ద్వీపంలో ఉన్న ఆర్వో నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఎప్‌స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను ఉపయోగించేవాడని ఫైల్స్‌లోని వివరాలు సూచిస్తున్నాయి.కానీ కేవలం ఆర్వో ప్లాంట్ నిర్వహణ కోసమే అయితే,ఇంత భారీ పరిమాణంలో యాసిడ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
దీంతో సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోళ్ల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.


