. పౌరసత్వం ధ్రువీకరణపై ఓటర్లలో భయాందోళన
. బీహార్ ఎన్నికల వేళ జాబితాల పరిశీలనపై విమర్శలు`అనుమానాలు
. కాషాయ పార్టీ వ్యతిరేక ప్రజా తీర్పుకు అవకాశాలు
న్యూదిల్లీ : బీహార్‌లో ఓటర్ల జాబితాల నిశిత పరిశీలన (ఎస్‌ఐఆర్) వివాదాస్పదంగా మారింది. ఎస్‌ఐఆర్‌పై ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు అధికార పక్షం విమర్శలు ఎదుర్కొంటున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ప్రక్రియ చేపట్టడంపై అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇందుకు ఎంపిక చేసుకున్న సమయం సరైనది కాదని సర్వోన్నత న్యాయస్థానం సైతం మొట్టికాయలు వేసింది. ప్రక్రియను తాత్కాలికంగా విరమించుకోవాల్సిందేనని ఎన్నికల సంఘానికి సూచించింది. ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమయ్యే సమయానికి అంటే ఈనెల 28న సుప్రీం తదుపరి విచారణ జరుపనున్నది. ప్రతిపక్షాలు సైతం ఎస్‌ఐఆర్ ఉపసంహరణకు డిమాండ్ చేస్తున్నాయి. పేదల ఓటు హక్కుకు భంగం కలిగించేందుకే ఎస్‌ఐఆర్ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చినట్లు దుయ్యబడుతు న్నాయి. వాస్తవంగా ఈసీ తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. భయపెడుతోంది. ఈ పరిణామాలు బీజేపీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నాయకుల్లో అంతర్గతంగా గుబులు మొదలైంది. పౌరసత్వం నిరూపించుకునే అంశం ప్రజలను భయాందోళనకు గురిచేయడంతో బీహార్ ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది.
బీహార్‌లో చేపట్టిన ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌కూ విస్తరించే ప్రమాదం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మహారాష్ట్ర తరహాలో బీహార్ ఎన్నికలను హైజాక్ చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, ప్రజలు అప్రమత్తం కావాలని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. 2026 మార్చిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా గెలిచి బెంగాల్‌లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను బీజేపీ బహిరంగంగా సమర్థిస్తుంది. కానీ లోలోపల తీవ్రస్థాయిలో ఆందోళనకు గురవుతోంది. బీజేపీకి దీర్ఘకాలంగా మద్దతిస్తున్న ప్రజలను పౌరసత్వం నిరూపించుకునే అంశం కలవరపెడుతున్నది. సరైన పత్రాలు లేని కారణంగా బీహార్‌లో బీజేపీకి ఉన్న ఓటర్లలో 1520 శాతం మంది, జేడీ(యూ) ఓటర్లలో 1015 శాతం మంది ఓటు వేయలేకపోవచ్చని బీహార్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. తాజా పరిణామాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారన్న భయం వెంటాడుతోంది. సరైన పత్రాలు, స్మార్ట్‌ఫోన్లు లేని వారు, నిరక్షరాస్యులు, సాంకేతిక పరిజ్ఞానం/ నైపుణ్యత తెలియని వారు కలవరపాటుకు గురవుతున్నారు. బీహార్‌లో వలసలు ఎక్కువ కావడంతో వలస జీవులు తమ వద్ద సరైన పత్రాలు ఉన్నప్పటికీ పౌరసత్వం నిరూపించుకోవాలంటే స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లడం కష్టం. ఎక్కడున్న వారు అక్కడ నుంచే సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా వారికి అంత సులువు కాదు. బీహార్ నుంచి వేర్వేరు రాష్ట్రాల్లో పనులకు వెళ్లిన వారంతా ఎన్యూమనరేషన్ ఫారాలు నింపేందుకు బీహార్ తిరిగి వెళ్లలేరు. అదే సమయంలో ఓటర్లుగా తమ పేర్లు తొలగిస్తే ప్రభుత్వం తమను గుర్తించదన్న భయం వారిని వీడటం లేదు. ఆధార్, రేషన్ కార్డులను ఎన్నికల సంఘం తిరస్కరించడం కూడా ప్రజల్లో భయాన్ని మరింతగా పెంచింది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఈ పత్రాల ప్రాధాన్యతపై సందేహాలకు ఈ చర్య తావిచ్చింది. ఆధార్, రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోకుంటే ఈ పత్రాల ఆధారంగా పొందుతున్న ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతామని దళితులు, వెనుకబడిన వర్గాలు, పేదలు తీవ్రస్థాయిలో ఆందోళనకు గురవుతున్నారు.
బీహార్ ప్రజల్లో ఈ భయం ఇంకా పెరిగితే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మారుస్తారని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తొలగిస్తారని భయపడిన ప్రజలు 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఆదరించలేదు. ఇప్పుడు మరలా అదే తరహా పరిస్థితి కమలం పార్టీకి ఎదురయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు. దీంతో ఎస్‌ఐఆర్‌పై తన పంథాను బీజేపీ మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు.


