Homeఆంధ్రప్రదేశ్నిర్మాణాలు ఘనం.. మెయింటినెన్స్ శూన్యం

నిర్మాణాలు ఘనం.. మెయింటినెన్స్ శూన్యం

- Advertisement -

 తక్కువ వెడల్పుతో ఉన్న రహదారిపై డివైడర్ నిర్మాణం..

 రాజకీయ నాయకుల బినామీలతో పుట్టుకొస్తున్న కొత్త కాంట్రాక్టర్లు.

 విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు అభివృద్ధి కుంటుపడుతోందా.. వివిధ పేర్లతో వస్తున్ననిధులు సక్రమంగా అమలు కావడం లేదా.. కొవ్వూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన అటుకెక్కిందా.. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం అవునని అనిపించే విధంగా పాలకుల తీరు.. అధికారుల వైఖరి ఉందన్న అభిప్రాయం పలువురులు వ్యక్తం అవుతుంది. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరు మున్సిపాలిటీకి వివిధ నిధుల కింద మంజూరైన వాటితో పట్నంలో వివిధ నిర్మాణాలు పూర్తయిన కొన్ని పనుల మెయింటినెన్స్ కు నిధులు లేక వాటి నిర్మాణాలు పాలకుల అధికారుల నిబద్ధతను ప్రశ్నిస్తున్నాయి. ఉదాహరణకు కొవ్వూరు మెయిన్ రోడ్ లో ఐడి ఎస్ ఎమ్ టి నిధులతో నిర్మాణమైన సంత మార్కెట్ను చెప్పవచ్చు. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మార్కెట్లో దాదాపు సగానికి పైగా ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీకి తగినంత ఆదాయం రావడం లేదు. ఈ మార్కెట్లో మొత్తం రేకు షెడ్లను పూర్తిగా తొలగించి కొత్తగా ప్లాన్ ఏర్పాటు చేసి మొత్తం షాపులన్నీ వినియోగం తెచ్చే విధంగా నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మునిసిపల్ పాలకులు ప్రయత్నించి విఫలమవుతున్నారు. అదే విధంగా 2015 పుష్కరాలలో కొవ్వూరు పెట్రోల్ బంకుల ఎదురుగా దండకుంటరేవు పేరిట బైపాస్ రోడ్డు నిర్మించారు. ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ పెద్ద పెద్ద గోతులతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మెయింటెన్స్ చేయకపోతే ఈ రోడ్డుపై ప్రయాణించేది ఎలాగని వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి వాహనాల కోసం కాదని ఆ ఏరియాలో ఉన్న కొందరు నాయకుల పొలాలు స్థలాలు రేట్లు పెరగడానికేనని అప్పటి కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ మున్సిపల్ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరొక నిర్మాణాన్ని చూస్తే విజయవిహార్ సెంటర్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ఇరుకుగా ఉన్న రోడ్డుపై సెంటర్ డివైడర్ను నిర్మించారు. అయితే పుష్కరినిధుల నుంచి నిర్మించిన ఈ డివైడర్ వల్ల ట్రాఫిక్ మరింత జటిలమైంది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున షాపులు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు తమ బైకులను షాపుల ముందే పార్కింగ్ చేయడంతో మరింత సమస్య ఎదురవుతుంది. ఈ డివైడర్ స్థానంలో వాహనాలను పార్కింగ్ చేయడానికి సెంటర్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

 అటకెక్కిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన..

 రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రెండు దశాబ్దాలకు పైగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతూనే ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యన హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆమె టైములోనైనా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తుందని పలువురు భావించారు. అయినా కార్యాచరణకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందారు.

 కొత్తగా పుట్టుకొస్తున్న కాంట్రాక్టర్లు..

 ఇటీవల కాలంలో కొవ్వూరు మున్సిపాలిటీకి కొత్త కాంట్రాక్టర్లు తెరమీదకి వస్తున్నారు. వీరిలో కొంతమంది స్థానిక నాయకుల బినామీలని వార్తలు తెరమీదకి వస్తున్నాయి. పదవిలో ఉన్న నేతలు కాంట్రాక్టులు చేయకూడదని భావించి తమ బంధువులను, నమ్మకమైన స్నేహితులను కాంట్రాక్టర్లుగా తెస్తున్నారని సమాచారం. ముఖ్యంగా నామినేషన్ పద్ధతిలో తమ అనుచరులకు పనులను అప్పగిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది.

 నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయింపు విషయంలో..

 మున్సిపాలిటీ తరఫున పట్టణాభివృద్ధి పనుల్లో నామినేషన్ పద్ధతిన చాలా పనులు నాయకులు తమ అనుచర ఘనమైన కాంట్రాక్టర్లకు అప్పచెబుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మున్సిపల్ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 అప్పటి హోం మంత్రి శంకుస్థాపన చేసిన పనులకే దిక్కు లేదాయే..మాజీ హోంశాఖ మంత్రి తానేటివనిత ప్రస్తుతం మూసి వేసి ఉన్న కొవ్వూరు సబ్ జైలును తొలగించి ఆ ప్రదేశంలో కొవ్వూరు టౌన్, సర్కిల్, రూరల్ సర్కిల్ ఆఫీసులను నిర్మించాలని ఆమె శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లో బ్రిటిష్ వారు కట్టినవి రావడంతో అవి శిథిల స్థితికి చేరుకున్నాయి. దీంతో కొత్త భవనాలు నిర్మించాలని అప్పటి హోం మంత్రి శంకుస్థాపన చేయగా అవి నేటికీ నిర్మాణాలకు నోచుకోకపోవడం పట్ల స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు