విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక నాల్గో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కరించాలని మంగళవారం ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు బొజ్జప్ప, శాంతిరాజు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మారెమ్మ అవ్వ దేవాలయం వెనుక ఉన్న నాల్గో వార్డులో గత 45 రోజులుగా కాలనీవాసులకు తాగునీరు అందడం లేదన్నారు. దీంతో తాము తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బీసీ కాలనీ నుంచి పైపులైను రావడంతో బీసీ కాలనీ వాసులు పైపులైనుకు అక్రమంగా రంద్రాలు వేసుకొని కొళాయిలు వేసుకున్నారని, దీంతో తమ కాలనీకి తాగునీరు రావడం లేదన్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు నిధులు లేవు వచ్చినప్పుడు వేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. కనీసం మా కాలనీలో ఉన్న పరిస్థితి కూడా చూడడం లేదన్నారు. కావున తక్షణమే అధికారులు స్పందించి మా కాలనీకి కొత్త పైపులైను వేసి తమ దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అమృత్ కుమార్, ఆనందు, అశోక్, ఎజ్రేన్, దేవమాత,విజయ్ కుమార్, వీరేష్, శాంతమ్మ తదితరులు ఉన్నారు.
కాలనీలో తాగునీటి సమస్య తీర్చండి
- Advertisement -
RELATED ARTICLES


