Homeజిల్లాలుఅనంతపురంటీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: నార్పల సత్యనారాయణ రెడ్డి

టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: నార్పల సత్యనారాయణ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా) : టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని ప్రజల బాగోగులు, పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి సూచించారు. సోమవారం నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి నిర్వహించినప్పటికీ, ఆయన సేవలను ప్రస్తావించకుండా జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి అంశాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి వినియోగం పెరిగి యువత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రజాప్రతినిధులుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన బండ్లపల్లి గ్రామ చరిత్రను కూడా గుర్తు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించారని, ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ పథకాలకు పేర్లు మార్చి కొనసాగిస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నాగేశ్వరరావు, మండల కన్వీనర్ ఖాదర్ వలి ఖాన్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎంపీటీసీ శంకర్ యాదవ్, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు