విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలకు కర్నూలులో ఉపాధ్యాయులు నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీ దీటైన సమాధానం ఇచ్చిందని టీడీపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు.
శనివారం పెద్దకడబూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది ఉపాధ్యాయులు నెలల తరబడి కష్టపడి చదివి, పరీక్షల్లో ప్రతిభ కనపరచి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఆధారాలు లేకుండా అక్రమాల ఆరోపణలు చేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆమె మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ఎవరికి, ఎక్కడ, ఎలా అన్యాయం జరిగిందో ఆధారాలతో ప్రజల ముందు నిరూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో జగన్ సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై విషప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మెగా డీఎస్సీపై అనుమానాలు ఉంటే ఆధారాలతో ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముందుకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీపై దుష్ప్రచారానికి ఉపాధ్యాయుల గర్జన
- Advertisement -
RELATED ARTICLES


