అదే స్థానంలో మరో రూపంలో ఆక్రమించారు
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం పాలకొండ ప్రధానరహదారి లో జె జె ఇనోటల్ హోటల్ పక్కన చెరువు నుండి సుమారు 12 అడుగుల కాలువ ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న స్థలాన్ని అక్రమ నిర్మాణం చేపట్టి వ్యాపారం సాగిస్తున్న ఈ ఆక్రమణను గత కొన్ని రోజుల క్రితం రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు తొలగించారు. అయితే ఆస్థానంలో కాలువ నిర్మాణానికి పనులు జరుగుతుంటుండగా హఠాత్తుగా బుధవారం తెల్లవారేసరికి అదే స్థానంలో బడ్డీ రూపంలో ఆక్రమణ ప్రత్యక్షం అయింది. ప్రజల దృష్టి మళ్లించడానికి రాత్రికి రాత్రి ఎంత చక్కగా షాపును ఏర్పాటు చేశారో చెప్పుకోదగ్గ విషయం. గతంలో తొలగించిన ఈ ఆక్రమణను మళ్లీ ఆక్రమించడం వెనుక ఎవరు హస్తం ఉందో, లేదంటే ముడుపులు అంది ఉంటాయేమోనని అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏదైనా సరే ఏమాత్రం వర్షం పడినా, ఇప్పటికే కాలువల్లో మురుగునీరు ప్రధాన రోడ్లమీదకు వస్తున్న పరిస్థితి రాజాం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆక్రమణలకు కట్టుడు చేయకపోతే భవిష్యత్తులో రాజాం ప్రాంతవాసులు మురికి నీటి కాలువలు తో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అని, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ఆక్రమణ వెంటనే తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు.


