విశాలాంధ్ర – రామచంద్రపురం : మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో మంగళవారం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ADA) శ్రీమతి ఎం. అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మండల వ్యవసాయాధికారి టి.వి.ఆర్. మణిదీప్ మరియు వ్యవసాయ సిబ్బందితో కలిసి , వరి పొలాలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు.ఈ సందర్భంగా ఏడీఏ అరుణ మాట్లాడుతూ, ప్రస్తుతం మండలంలో వరి పంటలు చాలా ఆరోగ్యకరంగా, ఆశాజనకమైన ఎదుగుదలతో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వరి సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వరి పంటను నష్టపరిచే కలుపు నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. అదేవిధంగా పంటను నశించే వివిధ రకాల పురుగులు, తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాటిని సకాలంలో అరికట్టేందుకు వాడాల్సిన పురుగు మందుల వివరాలను రైతులకు సూచించారు.ఈ పరిశీలనలో మండల వ్యవసాయాధికారి టీవీఆర్ మణిదీప్, వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు కొత్తూరు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


