
పార్టీ అగ్ర నాయకులు అందుబాటులో లేకపోవడంతో ఎటు తేలని వైనం..
జనసేన నాయకులను పరామర్శించిన బిజెపి..
రాజీ ప్రయత్నాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రజానీకం..
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి, జనసేన పార్టీల మధ్య మొదలైన ఘర్షణ వాతావరణం బుధవారం కూడా చల్లారలేదు. కొవ్వూరు పట్టణ టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ జరిగి అదికాస్తా చిలికి చిలికి గాలివానగా మారిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూ కొనసాగుతోంది. దీనికి కారణం రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ బహిరంగ సభ హడావుడిలో ఉండటం ఒక కారణంగా తెలుస్తోంది. జనసేన నాయకులు తమ పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ వద్దకు వెళ్లి తమ వాదన, తమకు అన్యాయం జరిగిందని వివరించి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారు అన్న విషయం బయటకు తెలియ రాలేదు. మరోవైపు టిడిపి అధినాయకుడు కూడా బహిరంగ సభ హడావుడిలో ఉన్నందున బుధవారం నాటికి తాత్కాలికంగా సమస్యకు తెరపడింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు జిల్లాకు వస్తే గాని ఒక విధమైన పరిష్కారం లభించే అవకాశాలు కానరావడం లేదు. కొవ్వూరు జనసేన ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే టీవీ..రామారావు ఇటీవల పార్టీ పదవులు విషయమై రహదారిపై నిరసన తెలపడంతో ఆయనను జనసేన పార్టీ ఇన్చార్జి విధంగా నుంచి తప్పించింది. మరి నేడు ఏకంగా చొక్కాలు చిరిగిపోయేలా ఘర్షణ జరిగిన నేపథ్యంలో జనసేన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న ఆసక్తి నియోజకవర్గం సర్వత్రా నెలకొన్న ఉంది.
టిడిపి వాదన వేరే రకంగా..
ఇదిలా ఉండగా రెండు పార్టీల మధ్య ఘర్షణగా చెబుతున్న సంఘటనపై టిడిపి వాదన మరొక విధంగా ఉంది. జనసేన యువనాయకులే మొదట తమ పట్ల దురుసగా వ్యవహరించార ని చెబుతున్నట్లు సమాచారం.
బిజెపి నాయకుల పరామర్శ.. సంఘటన పట్ల ఖండన..
టిడిపి జనసేన మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగుమళ్ల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి మైగాపుల బాలకృష్ణ తదితరులను బిజెపి నాయకులు బుధవారం పరామర్శించి జరిగిన సంఘటనను ఖండించారు. బిజెపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ తదితరులు బాధితులను పరామర్శించి జరిగిన సంఘటనను ఖండించారు. ఐకమత్యంతో ఉన్న పార్టీల మధ్య ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇటు పోలీసు శాఖకూడా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంఏర్పడాలని భావిస్తున్నట్లు తెలిసింది.


