రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ – స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రజలందరి సహకారం అవసరమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఈరోజు నెల్లూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించి, ఆధునిక క్రికెట్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలేజీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను వెంటనే ప్రారంభించి మూడు దశల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా ఒక రోజు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించింది. గత ప్రభుత్వం 135 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్తే, మేం వాటన్నింటినీ క్లియర్ చేస్తున్నాంఁ అని ఆరోపించారు. వైజాగ్, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. పట్టాల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, తమ ప్రభుత్వం పేదలకు శాశ్వత నివాస పత్రాలు అందిస్తోందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు.


