జగన్ తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానన్న మాజీ ఎంపీ
తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని వెల్లడి
పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, దేనికీ ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి)కి రాజీనామా పత్రం అందించానని, ఆయన ఆమోదం తెలిపారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. అన్నీ వివరంగా మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎన్నడూ విభేదాలు లేవని, ఆ కుటుంబానికి తాను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. నిరంతరం తాను పార్టీ కోసమే పనిచేశానని చెప్పారు. తన రాజీనామాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని విజయసాయి రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. కేవీ రావుతో తనకెలాంటి పరిచయం లేదని, ఎక్కడైనా ఎదురుపడితే నమస్కారం అంటే నమస్కారం అని పలకరించుకోవడం వరకేనని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజులు వేరు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి తాను న్యాయం చేయలేననే భావనతోనే రాజీనామా చేశానని చెప్పారు. తనకన్నా మెరుగ్గా పనిచేసే నేత తన స్థానంలోకి వస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశమే తప్ప వేరే కారణంలేదన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో నమోదైన కేసులో ఈడీ తనను ఏ2 గా చేర్చించిందని చెప్పారు. ఆ కేసును తాను చట్టపరంగానే డీల్ చేస్తానని వివరించారు.
నా పిల్లల సాక్షిగా చెబుతున్నా.. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని అన్నారు. ప్రస్తుతం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేశానని, వైసీపీ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని తెలిపారు. నేడో రేపో పార్టీకి కూడా రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి వివరించారు. బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఉన్న రెండు ఇళ్లల్లో ఒకటి మాత్రమే తనదని, విశాఖపట్నంలో ఓ అపార్ట్ మెంట్ ఉందని.. ఇవికాకుండా తనకు ఎలాంటి ఆస్తులు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.