ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టు ముట్టడి పిలుపు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఇంటెలిజెన్స్ బలగాలను మోహరించి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల దిగ్బంధంతో జూరాల ఆనకట్ట పరిసరాలు, క్షేత్రస్థాయి ప్రాంతాలు పూర్తిగా వ్యూహాత్మక బలగాల మోహరింపుతో నిండిపోయాయి. వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రాజెక్టు వైపు రాకుండా రహదారుల వెంట వాహన తనిఖీలు చేపట్టారు. మరోవైపు గద్వాలలోనూ కాలువలకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం, రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ కూడా నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ముట్టడి పిలుపు, పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ జూరాల ప్రాజెక్ట్ సమీపంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హౌస్ అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


