Homeతెలంగాణహైడ్రాలో 150 ఉద్యోగాలకు వేలల్లో అభ్యర్థులు.. సరూర్‌నగర్ స్టేడియంలో తోపులాట..

హైడ్రాలో 150 ఉద్యోగాలకు వేలల్లో అభ్యర్థులు.. సరూర్‌నగర్ స్టేడియంలో తోపులాట..

- Advertisement -

హైదరాబాద్‌లో కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో చెప్పేందుకు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఘటనే నిదర్శనం. హైడ్రా ప్రకటించిన 150 పోస్టుల కోసం వేలాది మంది యువత తరలిరావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. హైడ్రా విభాగంలో 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీని కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో ఉదయం 5 గంటల నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లలో అర్హత సాధించాలని సూచించారు. అయితే, ప్రకటించిన పోస్టుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా నిరుద్యోగులు ఇవాళ‌ తెల్లవారుజామునకే స్టేడియం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లే క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి, గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తోపులాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 150 ఉద్యోగాలకే ఈ స్థాయిలో పోటీ ఉందంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు