Homeజిల్లాలువిజయనగరంఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..!

ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..!

- Advertisement -

వంద మంది సిబ్బంది..
షాడో టీమ్స్..డ్రోన్స్.. సీసీ కెమెరాలు, విజిబుల్ పోలీసింగ్ తో పర్యవేక్షణ..

టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు

విజయనగరం టౌన్ : పట్టణంలోని బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రం హజరత్ ఖాదర్ బాబా 67 వ ఉరుసు మహోత్సవాలు సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఖాదర్ బాబా దర్బార్ లో ఉరుసు నిర్వాహకులైన దర్గా దర్బార్ ధర్మకర్త డా. ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజా ఖాదరీ (ఖలీల్ బాబు), చీమల పాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషిన్ ఖ్వాజా మొహియుద్దీన్ తో కలిసి సీఐ శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారని పేర్కొన్నారు. ప్రతీ ఏటా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యతను చాటుతూ ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వంద మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తమ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సూచనలు, ఆదేశాల మేరకు ఉత్సవాలపై పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో తొలి రోజు దర్గాపై ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలతో పాటు కింద దర్బార్ లో లక్ష మందికి పైగా భారీ అన్న సమారాధన, ఉరుసు రెండో రోజు ప్రధాన ఘట్టమైన బాబా సందల్ (ఊరేగింపు) కార్యక్రమాలు కీలక ఘట్టాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపిన మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు చెందిన భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా షాడో టీంలతో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్టు తెలిపారు. అవసరం మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తామని, వారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ విషయంలో భక్తులు పోలీస్ వారికి పూర్తిగా సహకరించాలని సీఐ శ్రీనివాసరావు కోరారు. బందోబస్తులో భాగంగా సాంకేతికతను జోడించి, ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. పోలీస్ వారి ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు ఎవరూ డ్రోన్స్ వినియోగించరాదని సూచిస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్, జన రద్దీ తదితర అంశాలపై సమీక్షించుకుని టీంను సిద్ధం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషపూరితంగా మత సామరస్యతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ ఉత్సవాలకు అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు విచ్చేసి భగవంతుని ఆశీస్సులు పొందుతూ మత సామరస్యతను కాపాడుతూ, జాతీయ సమైక్యతను చాటి చెప్పడం అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ఐతే ఇన్నేళ్లలో ఇప్పటి వరకు ఎన్నడూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈసారి కూడా అదేవిధమైన భక్తి భావనతో విచ్చేసే భక్తులు ఉత్సవాల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని టూ టౌన్ పోలీస్ శాఖ తరుపున విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్సై క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు