పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ విషయంలో తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. ఆ దేశ సుప్రీం లీడర్ పదవికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, అతిశయోక్తిగా అనిపించే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై విరుచుకుపడ్డారు. యుద్ధం ముగింపు కోసం చర్చలు జరగడం లేదని ఇరాన్ బాహ్య ప్రపంచానికి చెబుతున్నప్పటికీ, తెరవెనుక ఆ దేశ నేతలు తనను బ్రతిమాలుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ శాంతి ఒప్పందం కోసం ప్రాధేయపడుతోంది. కానీ ఈ విషయాన్ని వారు బయటకు చెప్పలేకపోతున్నారు. అలా చెబితే వారి సొంత ప్రజలే వారిని చంపేస్తారనే భయం వారిలో ఉంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
సుప్రీం లీడర్ పదవి ఆఫర్..
ఈ సందర్భంగా ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి, ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా తనను ఉండమని ఆ దేశ నేతలు కోరారంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించానని చెబుతూ తనదైన శైలిలో ప్రగల్భాలు పలకడం విశేషం. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత అతని కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. అమెరికా జరిపిన భీకర దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు యుద్ధ క్షేత్రంలో సైకలాజికల్ వార్‌ను తలపిస్తున్నాయి. అటు ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని పదే పదే ఖండిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల స్టంట్ లేక నిజంగానే ఇరాన్ అంతర్గతంగా లొంగిపోతోందా అన్నది తేలాల్సి ఉంది.


