ఇరాన్‌తో యుద్ధానికి దిగిన అమెరికాకు భారీ ఆర్థిక భారం తప్పడం లేదు. ఆరు నెలలు గడిచినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సైనిక చర్యల కోసం ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖ చేసిన ప్రత్యక్ష వ్యయం 38 బిలియన్ డాలర్లకు చేరింది.
భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2-3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో నెలకు దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడొచ్చు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు
డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి.ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ఉన్న ముప్పును తొలగించడమే ఈ చర్యల లక్ష్యమని ట్రంప్ అప్పట్లో ప్రకటించారు.కొద్ది వారాల్లోనే ముగుస్తుందని భావించిన సైనిక చర్యలు మాత్రం సుదీర్ఘ ఘర్షణగా మారాయి. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు.తాజాగా ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ట్రంప్ వెల్లడించారు.
నెలకు మరో రూ.25 వేల కోట్ల భారం!
ఇరాన్‌తో ఘర్షణ మరింత కాలం కొనసాగితే అమెరికా ఖజానాపై ఆర్థిక ఒత్తిడి పెరగనుంది.పోరాటం తక్కువ తీవ్రతతో సాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ్పుదీO తెలిపింది.దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే ఈ వ్యయం 3 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది.భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఉంటుంది.యుద్ధ ప్రభావం అమెరికా ఖజానాకే పరిమితం కాలేదు. ఆ దేశ సైన్యానికీ గణనీయమైన నష్టం వాటిల్లింది.ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వెలువడ్డాయి.పలు విమానాలు, సైనిక పరికరాలు కూడా నష్టపోయినట్లు సమాచారం.
భారీ ఖర్చు క్షిపణులపైనే!
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా పెద్ద సంఖ్యలో ఇంటర్సెప్టర్లను వినియోగించాల్సి వచ్చింది.దీంతో యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.ఈ ఘర్షణలో అమెరికా పెద్ద ఎత్తున క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది.ఆగస్టు 1 వరకు వినియోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికి సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ్పుదీO అంచనా వేసింది.ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్ల కోసం 7.3 బిలియన్ డాలర్లు, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ల కోసం 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాల కోసం 1.2 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని పేర్కొంది.
ఆయుధ నిల్వలకూ గండి
యుద్ధంలో ధ్వంసమైన లేదా కోల్పోయిన పరికరాలను భర్తీ చేసేందుకు మరో 1.9 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని CBO తెలిపింది.అంటే యుద్ధంలో ఆయుధాల వినియోగం మాత్రమే కాకుండా, వాటిని తిరిగి సమకూర్చుకోవడం కూడా అమెరికాకు భారీ ఆర్థిక భారంగా మారుతోంది. యుద్ధం కారణంగా అమెరికా ఖర్చులు పెరగడంతో పాటు ఆయుధ నిల్వలపైనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉపయోగించే ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయనిపేర్కొంది. వాటిని మునుపటి స్థాయికి తీసుకురావడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది.
హార్ముజ్ జలసంధి మూసివేత.. ప్రపంచానికీ ప్రభావం
దీనికి భిన్నంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదికలో కీలక ఆయుధాల విషయంలో స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్ ఏర్పడ్డాయని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యుద్ధం అమెరికా ఆయుధ సామర్థ్యాలపై ఎంతటి ప్రభావం చూపిందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. చమురు ధరలు పెరగడం వల్ల ఇంధన వ్యయంతో పాటు ఇతర వస్తువులు, రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అమెరికాలో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చని CBO తెలిపింది.
ఇప్పుడే అసలు బిల్లు రాలేదా?
2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.CBO అంచనా వేసిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన అన్ని ఖర్చులూ పూర్తిగా చేరలేదని తెలుస్తోంది. అమెరికా సైనిక స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్తులో చేపట్టాల్సిన మరమ్మతులు,యుద్ధం కోసం తీసుకునే రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ వంటి అంశాలు ఇందులో పూర్తిగా లేవు. అలాగే సైనికులకు భవిష్యత్తులో అందించాల్సిన వైద్య సదుపాయాలు, వైకల్య ప్రయోజనాలు వంటి వ్యయాలు కూడా ఈ లెక్కల్లో పూర్తిగా చేర్చలేదు. రక్షణ శాఖ నుంచి కోరిన సమాచారానికి పూర్తి స్థాయిలో సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది.
అమెరికాకే కాదు.. ట్రంప్‌కూ రాజకీయ సవాళ్లు!
దీంతో యుద్ధం మొత్తం వ్యయం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో చివరికి అమెరికాపై పడే మొత్తం ఆర్థిక భారం ఎంత అన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు ఈ ఘర్షణ ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాయిటర్స్ సహా పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆయన ప్రజాదరణ క్రమంగా తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు ఆ సర్వేలు సూచించాయి.
నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీలోనూ ఆందోళన పెరుగుతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై ప్రభావం ఆయన ముందున్న సవాళ్లుగా నిలుస్తున్నాయి.


