ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.విజయవాడకు అనుబంధంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం మాత్రం ఇప్పటికీ కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలనే నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది.మార్కాపురం,మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని,అదనంగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించబడ్డాయి.ఇప్పుడు మరోకొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ మొదలైంది. బుధవారం సచివాలయంలో జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని డివిజన్లలో మార్పులు, సవరణలపై చర్చించి ప్రభుత్వం ముందుకు పెట్టే సూచనలను ఖరారు చేయనున్నారు.
జనగణన ప్రారంభం దృష్ట్యా డిసెంబరు చివరికల్లా ఈ ప్రక్రియ ముగించాలి
అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మరోసారి చర్చ జరగనుంది. చివరి నిర్ణయం మాత్రం 10వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నారు.ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే విధంగా ఉండాలనే అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోంది.అయితే ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటే పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి రావడంతో వెంటనే పూర్తి చేయడం కష్టసాధ్యం.జనగణన ప్రారంభం దృష్ట్యా డిసెంబరు చివరికల్లా ఈ ప్రక్రియను ముగించాల్సిన అవసరం ఉంది.
శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరణ
గత వైకాపా ప్రభుత్వ కాలంలో తగిన ప్రణాళికలు లేకుండా తొందరపాటు నిర్ణయాలతో జిల్లాల విభజన జరిపిన కారణంగా ఇప్పటికీ అనేక పరిపాలనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే ఈసారి ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని చూస్తోంది.ఎలాగూ త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది కాబట్టి, ఆ తర్వాత వాటికి అనుగుణంగా రెవెన్యూ డివిజన్లను సవరించే అవకాశం కూడా పరిశీలించనుంది.


