సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకుని ఐక్యతా యాత్ర
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : యువతలో ఐక్యతా భావం , దేశభక్తి లను పెంపొందించడానికి, నవంబర్ 11వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యతా యాత్రను నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యూత్ ఆఫీసర్ తిరి గోపి స్పష్టం చేశారు. శనివారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజిత భారతాన్ని ఐక్యంగా తీర్చిదిద్దిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దని, ఆయన స్ఫూర్తితో నేడు ప్రధాని మోడి జాతీయ నిర్మాణ లక్ష్యమైన వికసిత్ భారత్ 2047ని సాధించడానికి కృషి చేస్తున్నారన్నారు. అక్టోబర్ 6న కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి డా. మనస్సుఖ్ మాండవియా దేశవ్యాప్తంగా ఈ ప్రచారానికి చెందిన డిజిటల్ దశను ప్రారంభించారని, ఇందులో యువతకు సోషల్ మీడియా రీల్ పోటీలు, వ్యాస రచన పోటీలు, యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు , డిజిటల్ కార్యకలాపాలు మై భారత్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారని , దీనివల్ల దేశంలోని యువతంతా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చినట్లవుతుందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రీ-ఈవెంట్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రచనా వ్యాసాంగ పోటీలు, పటేల్ జీవితం పై పండితుల ఉపన్యాసాలు , నాటకాలు, మాల్స్ , పార్కులు, ఫుడ్ కార్నర్లు వంటి ప్రజాస్థలాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచారానికి సంబందించిన అత్యంత ముఖ్యఘట్టం రాజ్యాంగ దినోత్సవం రోజైన నవంబర్ 26న ప్రారంభమవుతుందని, ఆ రోజున ప్రతి జిల్లాకు చెందిన ఇద్దరు పాదయాత్రికులు కరంసాద్ నుంచి కేవడియాలలోని స్టేట్యూ ఆఫ్ యూనిటీకు చేరుకుని దేశవ్యాప్తంగా అనేకుల గ్రూపులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తారన్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఈ ప్రచారానికి సంబందించిన రెండ దశ ప్రచారాన్ని ప్రారంభిస్తామని, ఈ క్రమంలో పట్టణాలు, గ్రామాలలో పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రల్లో యోగా, ఆరోగ్య శిబిరాలు, ఉపన్యాసాలు, చర్చలతో పాటు డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞలు చేయడం జరుగుతుందన్నారు. సర్దార్ పటేల్ ఆయా దేశాన్ని ఏకీకృతం చేసినట్లే , మా ఈ పాదయాత్రలు కూడా ప్రజల హృదయాలను ఏకీకృతం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వాలంటరీ సత్యసాయి , కార్యక్రమం కన్వీనర్ శివ నాగరాజు , కో కన్వీనర్ శ్రీనివాస్ , ఫణీంద్ర , రవిశంకర్ , వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


