ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ ముందంజ
జైపుర్: బ్యాట్‌తో చుక్కలు చూపించిన చిన్నోడు. స్టేడియంలో ఫోర్లు, సిక్కర్లతో పరుగుల వరద పారించాడు. వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించిన వేళ…రాజస్థాన్ మళ్లీ గాడినపడింది. పరాభవాల నుంచి తేరుకున్న రాయల్స్… ఏడో విజయంతో చిట్టచివరి ప్లేఆఫ్స్ బెర్తు రేసులో మిగతా జట్ల కన్నా ముందు నిలిచింది. వైభవ్ వీరవిహారంతో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. 13 మ్యాచ్‌ల నుంచి 14 పాయింట్లు సంపాదించిన రాజస్థాన్, ఇక తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే చాలు…సమీకరణాలతో సంబంధం లేకుండా ముందంజ వేస్తుంది.
వైభవ్ సూర్యవంశీ 38 బంతులను ఎదుర్కొని 10 సిక్సులు, 7 ఫోర్లు సాయంతో 93 పరుగులు చేశాడు. హీరోచిత ఇన్నింగ్స్‌తో మంగళవారం రాయల్స్ 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. మిచెల్ మార్ష్ (96), ఇంగ్లిస్ (60)ల విధ్వంసంతో మొదట లఖ్‌నవూ 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు ధ్రువ్ జురెల్ (53 నాటౌట్), యశస్వి జైస్వాల్ (43) మెరవడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పరాగ్ గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు జైస్వాల్ నాయకత్వం వహించాడు.
వైభవ్ మెరుపులు…స్టేడియంలో అరుపులు
సొంతగడ్డలో ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఛేదనలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆట హైలెట్ అయింది. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన అతడు…కళ్లు చెదిరే స్ట్రోక్‌ప్లేతో ఆ జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఫోర్లు, సిక్సులు బాదుతుంటే స్టేడియం అరుపులతో హోరెత్తింది. రాజస్థాన్‌కు చాలా ముఖ్యమైన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఎప్పటిలాగే చెలరేగినా…సహనం పాటించి పరుగులు సాధించాడు. ఛేదనలో మొదట్లో జైస్వాల్ చకచకా బౌండరీలు బాదేశాడు. వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి పది బంతుల్లో అయిదు పరుగులే చేశాడు. కానీ క్రమంగా జోరందుకున్నాడు. మయాంక్ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్ మార్చిన అతడు… జైస్వాల్ నిష్క్రమించినా, దూకుడు కొనసాగించాడు. ఆకాశ్ ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు. 10 ఓవర్లలో 121/1తో రాజస్థాన్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఏమాత్రం తగ్గని వైభవ్.. ప్రిన్స్ యాదవ్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లతో చెలరేగాడు. మరోవైపు నెమ్మదిగా మొదలెట్టిన జురెల్… కమంగా జోరందుకున్నాడు. అతడు రెండు సిక్స్‌లు, ఫోర్.. వైభవ్ రెండు సిక్స్‌లు బాదడంతో 12వ ఓవర్లో మయాంక్ యాదవ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. 12 ఓవర్లలో 166/1తో రాజస్థాన్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఆఖరి ఎనిమిది ఓవర్లలో కేవలం 55 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు సమీకరణం తేలికైపోయింది. కానీ అలవోకగా సెంచరీ పూర్తి చేసేలా కనిపించిన వైభవ్…ఓ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. తరువాత జురెల్ ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో రాయల్స్‌కు 10 పరుగులు అవసరమయ్యాయి. జురెల్ ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా…ఫెరీరా(16 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
వైభవ్ వీర విహారం…రాయల్స్ విజయం
- Advertisement -


