విశాలాంధ్ర – విడపనకల్లు.. విడపనకల్లు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవి) విద్యార్థిని యు. వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటి గ్రామ కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. విడపనకల్లు గ్రామానికి చెందిన రైతు యు. హనుమంతు కుమార్తె వెంకటలక్ష్మి ప్రస్తుతం స్థానిక కేజీబీవి లో 10వ తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఆమె, బాల్ బ్యాడ్మింటన్‌లో తన ప్రతిభను చాటుతూ జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించారు. ఇటీవల అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రామపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 01 వరకు నిర్వహించిన 70వ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (2025-26) పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆమె పాల్గొన్నారు. ఈ పోటీలలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, జాతీయ స్థాయిలో తృతీయ స్థానం (కాంస్య పతకం) కైవసం చేసుకున్నారు. ఒక సామాన్య రైతు బిడ్డగా, పట్టుదలతో శ్రమించి జాతీయ స్థాయిలో పతకం సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ పి.తులసిప్రియ, వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిఈటి) ఎస్.రుద్రమ్మ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని, వెంకటలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో తృతీయ స్థానం సాధించిన విడపనకల్ విద్యార్థిని
- Advertisement -
RELATED ARTICLES


