విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర, కామర్స్, తెలుగు సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఈ నెల 10న వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజారాణి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పదవ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అభ్యర్థుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు విద్యార్థుల సమక్షంలో డెమో క్లాస్ నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. నెట్ , సెట్ , పీహెచ్డీ వంటి అదనపు అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని సూచించారు.ఎంపికైన అభ్యర్థులను గంటల ప్రాతిపదికన తాత్కాలికంగా అతిథి అధ్యాపకులుగా నియమిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.


