అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తాం…
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
విశాలాంధ్ర -అనంతపురం : గత పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ అమిత్ షాలు అహంకారంతో రాజ్యపాలన చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో జరిగిన అగ్రిగోల్డ్ ద్వారా మోసపోయి మనస్థాపంతో మృతి చెందిన కుటుంబాలకు ఆదుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఏపీలో 800 మంది, కర్ణాటక లో 400 మంది , ఒరిస్సాలో 100 మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసం చేసిన కారణంగా వీరు మృతి చెందడం జరిగిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం వారికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారన్నారు. వైకాపా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి ఏదో కొంత నగదు అందించి ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి దాని గురించి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనటువంటి జనసేన, టిడిపి నాయకులు అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని చెప్పి ఆరు నెలల కావస్తున్న పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. గత 18వ తేదీన సిఐడి చీఫ్ రవి శంకర్ అయ్యంగార్ నేతృత్వంలో సిపిఐ పార్టీ,అగ్రిగోల్డ్ యాజమాన్యం, సిఐడి లో అప్పట్లో పని చేసిన విశ్రాంతి ఉద్యోగులు, బాధితులతో బాధితుల పరిష్కార దిశగా వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీజీపీ ద్వారకాతిరుమలరావు, రవిశంకర్ అయ్యంగార్ లకు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన సిపిఐ పార్టీ అభినందిస్తుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడుని కలవడం జరిగిందన్నారు . ఈ విషయంపై చంద్రబాబు శాసనసభ సమావేశంలో చర్చించలేదన్నారు. జనవరి 30లోగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి , నగర కార్యదర్శి శ్రీరాములు , నగర సహాయ కార్యదర్శి అలిపిర తదితరులు పాల్గొన్నారు.