ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ప్రతి ఎకరాకు సాగునీటి హామీని లిఖితపూర్వకంగా ప్రకటించాలి
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణ గ్రామసభ
బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల భూములు సేకరించి ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఆ నీటిని పరిశ్రమలకు, డేటా సెంటర్లకు మళ్లించి వ్యవసాయానికి అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతుల భూములకు ఎకరాకు రూ.40 లక్షలు సరిపోవని, ఎకరాకు రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ గ్రామసభలో రైతుల పక్షాన ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైతుకు భూమి అంటే కేవలం ఆస్తి కాదని, అది తరతరాల కుటుంబ చరిత్ర, జీవనాధారమని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు, పూర్వీకుల సమాధులు, కుటుంబ జ్ఞాపకాలు, ఆ భూములకు ఉన్న అనుబంధాలను కేవలం పరిహారం లెక్కలతో వెలకట్టలేరన్నారు. సుప్రీంకోర్టు సైతం భూసేకరణలో బాధితుల ప్రయోజనాలు, మానవీయ దృక్పథం, న్యాయమైన పరిహారం ప్రాధాన్యతను గుర్తించిందని పేర్కొంటూ ప్రభుత్వం రైతుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
రైతులు తమ భూములను త్యాగం చేస్తున్నది ఇతర ప్రాంతాల రైతులకు సాగునీరు అందాలనే ఆశయంతోనేనని పేర్కొన్నారు. పద్మారం ప్రాంత రైతులు భూములు కోల్పోతూ దిగువ ప్రాంతాల వ్యవసాయానికి నీరు అందాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందనే హామీని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాటలతో కాకుండా అధికారిక హామీతో రైతులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.
డేటా సెంటర్లకు నీళ్ల మళ్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి!
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నీటిని డేటా సెంటర్లకు మళ్లిస్తారనే సందేహాలు రైతుల్లో ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ఆరోపణ కాదని, రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి నిర్మించే ప్రాజెక్టు నీటిని వ్యవసాయ అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లించే ఆలోచన ఉంటే ముందుగానే స్పష్టంగా ప్రకటించాలని కోరారు.
సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములు సేకరిస్తే ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, వ్యవసాయ పనులు కోల్పోయే కూలీల కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం భూముల విలువను లెక్కించకుండా రైతుల కుటుంబాల భవిష్యత్తు, భావోద్వేగాలు, వ్యవసాయ కూలీల జీవనోపాధి, గ్రామీణ వ్యవస్థపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏదిర రాజు, వీరన్నపేట ఉపసర్పంచ్ పరిగి శివకుమార్, జిల్లా సామాజిక మాధ్యమాల కన్వీనర్ మాల నవీన్, గొల్ల మల్లేష్, రవీందర్ రెడ్డి, భీమయ్య, మండల కార్యదర్శి నరేష్, చనగల యాదగిరి, జె. నరేష్, గిరిజన మోర్చా అధ్యక్షుడు విట్టల్, కృష్ణయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు..


