బిహార్ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరో కీలక హామీ ఇచ్చారు.ఇండియా కూటమి బిహార్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే మై-బహిన్ మాన్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు సంవత్సరానికి రూ.30,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.తేజస్వీ ప్రకారం, ఈ నగదు బహుమతిని ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి (జనవరి 14) న మహిళలకు ఃసంక్రాంతి కానుకఃగా అందిస్తారు.
మహిళల ఆర్థిక సాధికారతను పెంచడమే లక్ష్యం
తాజాగా బిహార్ ప్రభుత్వం నవరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమ చేయడం గుర్తు చేసుకుంటే, తేజస్వీ చేసిన ఈ ప్రకటన ఎన్నికల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.అలాగే, బిహార్‌లో మహిళలు కుటుంబ, సమాజ, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉండేలా విధానాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.తేజస్వీ హామీతో బిహార్ రాజకీయాల్లో మరోసారి మహిళా ఓటర్ల ఆకర్షణ కోసం పోటీ ముదిరింది.అధికార జేడీయూ, బీజేపీ కూటమిపై ఒత్తిడి పెంచే విధంగా ఆర్జేడీ ఈ హామీని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


