–వినూత్న ప్రచారం చేసిన పోలీసులు
విశాలాంధ్ర- అనంతపురం టౌన్: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుల్లితెర నటులతో కలిసి రోడ్డు భద్రతపై శనివారం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ సూచనలతో స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద బుల్లితెర నటులు సుస్మిత, ప్రభాకర్ , పవన్ సాయి, అనిల్ , శ్రీరాం, ప్రొడ్యూసర్ నటుడు శివకుమార్ తదితరులు రోడ్డు భద్రత పాటింపు నిబంధనలు కల్గిన ఫ్లకార్డులనూ చేతుల్లో పట్టుకుని ప్రదర్శనగా నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుల్లితెర నటులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్టు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని వారు హెచ్చరించారు. అతి వేగంగా వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంకన్ డ్రైవింగ్) వల్ల కేవలం వాహనదారులే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలంతా డ్రంకన్ డ్రైవింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ట్రైనీ ఐపిఎస్ అధికారి అశ్విని మణిదీప్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత అనేది చట్టాల భయంతో పాటించాల్సిన అంశం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి నైతిక బాధ్యతని తెలిపారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈకార్యక్రమంలో సి.ఐ లు వెంకటేష్ నాయక్ , వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ , రాజేంద్రనాథ్ యాదవ్ , జగదీష్ , డిస్కవర్ అనంతపురం అనిల్ , పలువురు ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.


