పాఠశాల వద్ద కనిపించిన పామును సీసాలో బంధించి తీసుకువచ్చిన వైనం
వార్డులోని పరిస్థితిని తెలిపేందుకే ఇలా చేశానని కౌన్సిలర్ వివరణ
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఓ కౌన్సిలర్ సమావేశానికి పామును తీసుకుని రావడం కలకలం రేపింది. పట్టణంలోని 20వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్, కౌన్సిల్ సమావేశానికి ఏకంగా ఓ తాచుపామును తీసుకొచా్చరు. దీంతో ఆ భేటీకి వచ్చిన వారంతా హడలిపోయారు.. ఇంతకీ పామును ఎందుకు తీసుకొచ్చారా అని ఆరా తీస్తే అప్పుడు కానీ అసలు సంగతి తెలియలేదు. అధికారుల తీరుకు నిరసనగా ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు.
శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన అనిల్‌కుమార్ ఓ సీసాలో బంధించిన పామును సంచిలో పెట్టుకొని హాల్‌లోకి వచ్చారు. తన కుర్చీ పక్కన ఆ సంచిని పెట్టుకోవడాన్ని ఏఈ హేమంత్ గమనించారు. దాన్ని బయటపెట్టి రావాలని కోరగా కౌన్సిలర్ నిరాకరించారు. చివరకు, ఛైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో ఆయన పాము ఉన్న సంచిని బయటపెట్టి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలు, మున్సిపల్ పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, వాటిని తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.ఉదయం పాఠశాల వద్ద ఈ తాచుపాము కనిపించిందని, ఓ బాలుడు దాన్ని గమనించకుండా పక్కనుంచే వెళ్లాడని తెలిపారు. ఆ బాలుడికి పాముకాటు వేసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వార్డులో నెలకొన్న ప్రమాదకర పరిస్థితిని అధికారుల కళ్లకు కట్టేందుకే పామును సమావేశానికి తీసుకువచ్చానని ఆయన వివరించారు. కౌన్సిలర్ వినూత్న నిరసనతో వార్డులోని పారిశుద్ధ్య సమస్య తీవ్రత మరోసారి చర్చకు వచ్చింది.


