సీపీఐ ప్రధాన కార్యదర్శులు – 6
ఆర్వీ రామారావ్
బెంగాల్‌లోని వర్ధమాన్ జిల్లాలో జన్మించిన అజయ్ ఘోష్ తన తండ్రి డా. సచీంద్రనాథ్ ఘోష్ తో పాటు కాన్పూర్ వెళ్లిపోయారు. 1926లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరకముందు అజయ్ ఘోష్‌కు భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్‌తో పరిచయం అయింది. భగత్ సింగ్ నాయకత్వంలోని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో అజయ్ ఘోష్ సభ్యులుగా ఉండేవారు. 1929లో లాహోర్ కుట్రకేసు విచారణ నేపథ్యంలో అజయ్ ఘోష్‌ను అరెస్టు చేశారు. కానీ తగిన సాక్ష్యాధారాలు లేనందున విడుదల చేశారు. 1931లో ఆయనను మరో సారి అరెస్టు చేశారు. అప్పుడే ఆయనకు జైలులో శ్రీనివాస్ సర్దేశాయ్‌తో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తరవాత అజయ్ ఘోష్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
1951లో ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1962లో క్షయ వ్యాధితో 53వ ఏట మరణించేదాకా సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. భారత్, చైనా యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయనే సీపీఐ అగ్రనాయకుడు. ఆ సమయంలో అజయ్ ఘోష్ సీపీఐలో మధ్యేవాద నాయకుడిగా ఉండేవారు. అజయ్ ఘోష్ సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సీపీఐని దేశమంతటా తెలిసేట్టు చేశారు. ఆ దశలోనే కాంగ్రెస్ తరవాత సీపీఐ అతి పెద్ద పార్టీగా ఉండేది. సీపీఐ ప్రతిష్ఠ పెరగడంలో అజయ్ ఘోష్ పాత్ర చాలా ఉంది. 1920లు, 1930లలో అజయ్ ఘోష్ భగత్ సింగ్ నడిపిన అజ్ఞాత కార్యకలాపాలలో భాగస్వామిగా ఉన్నారు. అయితే అలాంటి ఉద్యమానికి జనబాహుళ్యంతో సంబంధం ఉండదని ఆయన గ్రహించారు. అజ్ఞాతంగా ఉద్యమం నడపడం సరైన దారి కాదన్న భావన భగత్ సింగ్‌కు కూడా ఉండేది. ఉరి తీయకుండా ఉంటే భగత్ సింగ్ కచ్చితంగా సీపీఐలో చేరి ఉండేవారు.
అజయ్ ఘోష్ కు మార్క్సిస్టు సిద్ధాంతం మీద మంచి పట్టు ఉండేది. ఈ సిద్ధాంతాన్ని కరదీపికగా ఉపయోగించి ఆయన అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడ్డారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి సైద్ధాంతిక వివరణ ఇచ్చే వారు. స్వాతంత్య్ర సాధన తరవాత తొలి దశలో కమ్యూనిస్టులలోనే నెహ్రూ ప్రభుత్వ సామర్థ్యం, స్వభావంపై అనేక అనుమానాలు ఉండేవి. అసలు బూర్జువా వర్గం స్వాతంత్య్రం సాధిస్తుందా అన్న అనుమానాలు ఉండేవి. స్వతంత్ర భారతంలో విచిత్రమైన పరిస్థితులు ఉండేవి. ఒక వేపు రాజకీయ ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంటోంది. మౌలిక సదుపాయాలు గల ఆర్థిక పునాది మీద ప్రజాస్వామ్యం బలపడుతోంది. ప్రభుత్వ రంగం బలంగా ఉండేది. విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండేది. భావ ప్రకటనా స్వేచ్ఛకు కొదవే లేదు. బహుళ పార్టీల వ్యవస్థ రూపుదిద్దుకుంటూ ఉండేది. ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు ఉండేవి. ప్రజోద్యమాలు బహిరంగంగానే జరిగేవి.
ప్రజోద్యమాల ద్వారానే అనేక హక్కులు ప్రజలు సాధించుకోగలిగారు. వెనుకబడిన దేశంలో బూర్జువా వర్గం అధికారంలో ఉండగా ఇలాంటి పరిస్థితులున్నప్పుడు కమ్యూనిస్టుల వైఖరి ఎలా ఉండాలి అన్నది అప్పుడు సమస్య. ఈ స్థితి కమ్యూనిస్టులలో ఒక వర్గానికి అయోమయంగా ఉండేది. ఈ వర్గానికి అసలు మనం సాధించిన స్వాతంత్య్రమే బూటకం అన్న అభిప్రాయమూ ఉండేది. ప్రజాస్వామ్యం, మౌలిక మార్పులు కేవలం శ్రామిక వర్గ నాయకత్వంలో (అంటే కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలోనే సాధ్యం) అన్న ధోరణి కొందరు కమ్యూనిస్టుల్లో ప్రబలంగా ఉండేది. ఈ వర్గం వారు ఎన్నికలే బూటకం అన్నారు. కానీ ఆ ఎన్నికల ప్రక్రియ ద్వారే 1957లో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పెడసర ధోరణే ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీని బాగా దెబ్బ తీసింది. దేశంలో అప్పుడు ఓ విశిష్టమైన పరిస్థితి ఉండేది. ఒక వేపున మంచి పునాదులున్న ప్రజాస్వామ్యం, ప్రగతిశీలమైన సామాజికార్థిక అభివృద్ధి పంథా కొనసాగుతూ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు కమ్యూనిస్టులు తమకు తామే నష్టం చేసుకున్నారు.
ఈ స్థితిలో అజయ్ ఘోష్ రచనలు, ఉపన్యాసాలు జాతీయ భావనలు, వర్గ దృక్పథంతో విశ్లేెషణలతో కూడి ఉండేవి. జాతీయ దృష్టి లేకుండా కమ్యూనిస్టు పార్టీ మనలేదని అజయ్ ఘోష్ సరిగ్గానే అంచనా వేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ అవగాహన తప్పని సరి. దేశంలో, ప్రపంచంలో నూతనాంశాలన్నింటినీ అజయ్ ఘోష్ ఆకళింపు చేసుకున్నారు. జాతీయ, వర్గపరమైన సమస్యలకు పరిష్కారం కోసం జనం కమ్యూనిస్టుల వేపు చూస్తున్న రోజులవి. ప్రభుత్వ రంగం, జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ, శాంతి, నిరాయుధీకరణ కోసం పోరాటం, ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను గుర్తించడం, గోవా, పుదుచ్చేరి విమోచన, సోషలిస్టు దేశాలతో స్నేహంÑ ఇలా అన్ని చోట్ల కమ్యూనిస్టుల పాత్ర కనిపించేది. దీనికి అజయ్ ఘోష్ కృషే ప్రధానం. మావోయిస్టు భావజాల ప్రభావాన్ని కూడా అజయ్ ఘోష్ సవ్య్గంగానే గుర్తించారు. ఆ దశలోనే కమ్యూనిస్టు పార్టీ చీలకుండా చూడడానికి ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయత్నించారు. అంతర్జాతీయంగా మావోయిస్టు ధోరణి వల్ల కలిగే నష్టాన్ని వివరించడానికి ఆయన చైనా కూడా వెళ్లారు. అదే సమయంలో అంతర్జాతీయంగా మావోయిజం ప్రాబల్యం కారణంగా సీపీఐలో మావోయిస్టు భావజాలానికి గురైన వారు బలం పుంజుకున్నారు. 1961లో విజయవాడలో జరిగిన సీపీఐ మహాసభకు క్షయ వ్యాధితో బాధపడుతున్న అజయ్ ఘోష్‌ను స్ట్రెచర్ మీద తీసుకు రావాల్సి వచ్చింది. అజయ్ ఘోష్ సైద్ధాంతిక పోరాటం మరువలేనిది.