ఈడెన్ టెస్టు విజయంపై గంగూలీ
కోల్‌కతా: భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుత అధ్యాయంగా నిలిచిపోయిన 2001 ఈడెన్ గార్డెన్స్ టెస్టు జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి హీరోలు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయంలో ముఖ్య భూమిక వహించిన హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వెంకటేశ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా… అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ వర్చువల్‌గా చేరాడు. ఈ విజయంపై గంగూలీ మాట్లాడుతూ.. “అది విధిరాత. ఒక అద్భుతమైన కథలాంటిది. ఆ విజయం కోసం నా దగ్గర ప్రత్యేకమైన వ్యూహమేమీ లేదు. అది నేను చేసింది కాదు. దానంతట అదే జరిగిపోయింది” అని తెలిపాడు. ఆ మ్యాచ్ హీరో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… “నా తల్లిదండ్రుల వల్ల నేను క్రికెట్ ప్రపంచంలోకి వచ్చాను. కానీ, ఈడెన్ గార్డెన్స్ లేకపోతే నేను ఏమయ్యేవాడినో నాకు తెలియదు” అని కళ్లు చెమర్చాడు. అనిల్ కుంబ్లే గాయపడటంతో తనకు అవకాశం వచ్చిందని… వికెట్లు తీయగల బౌలర్ కావాలని కోచ్ జాన్ రైట్ భావించగా… గంగూలీ పట్టుబట్టి తనను జట్టులోకి తీసుకున్నాడని హర్భజన్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట గురించి జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఆ రోజు ఒక్క వికెట్ కూడా కోల్పోకూడదని మేనేజర్ చేతన్ చౌహాన్ తమతో అన్నారన్నాడు. లక్ష్మణ్, ద్రవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఓటమి అంచున ఉన్న జట్టును ఓడిపోలేని స్థితికి తీసుకొచ్చారని తెలిపాడు. ఐదో రోజు రాహుల్ ద్రవిడ్, శివ సుందర్ దాస్, రమేశ్ పట్టిన క్యాచ్‌లు విజయంలో కీలకపాత్ర పోషించాయని హర్భజన్ తెలిపాడు. ఇక, వెంకటేశ్ ప్రసాద్ తాను క్యాచ్ వదిలేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ… ప్రేక్షకుల అరుపుల వల్ల క్యాచ్ మిస్ చేశానన్నాడు.‘ టీ విరామ సమయంలో నాకు నరకం కనిపించింది. పదేపదే టీవీలో అదే చూపించడంతో చాలా బాధపడ్డాను’ అని చెప్పాడు. తాను ఆడిన కెప్టెన్లలో ఉత్తముడు గంగూలీ అని హర్భజన్ ప్రశంసించాడు. గంగూలీ అందరికీ అందుబాటులో ఉండేవాడని జహీర్ ఖాన్ అన్నాడు.
2001 మార్చి 11-15 మధ్య భారత్`ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ టెస్టు జరిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 171 పరుగులకే ఆలౌట్ అయి, 274 పరుగుల భారీ లోటుతో ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ (281), ద్రావిడ్ (180) కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరు నాల్గవ రోజు మొత్తం వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. దీంతో ఫాలోఆన్ ఆడిన భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 657/7 (డిక్లేర్డ్) స్కోరు చేసి ఆస్ట్రేలియాకు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో హర్భజన్ సింగ్ టెస్టుల్లో భారత్ తరపున మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.


