కేంద్రానికి వామపక్ష ఎంపీల ప్రశ్న: పార్లమెంటు వద్ద నిరసన
న్యూదిల్లీ: వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని భారీ సుంకాలు, అదనపు జరిమానాలు విధిస్తూ భారత్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటాడుకుంటున్నారని సీపీఐ ఎంపీలు పి.సంతోశ్ కుమార్, వి.సెల్వరాజ్, పీపీ సునీర్ విమర్శించారు. అమెరికా వేధిస్తుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు. ప్రధాని, కేంద్రమంత్రులు దీటుగా సమాధానం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఒడిశాలో నన్స్‌పై దాడిని సీపీఎం, సీపీఐ(ఎంఎల్) ఎంపీలు మార కె.రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, ఏఏ రహీం, ఆర్. సచ్చితానందం, సుధామ ప్రసాద్, రాజారామ్‌తో కలిసి శుక్రవారం పార్లమెంటు వెలుపల నిరసనకు దిగారు. భారత సార్వభౌమత్వం, స్వయంప్రతిపత్తిపై రాజీ వద్దని కేంద్రానికి వామపక్ష ఎంపీలు హితవు పలికారు. ట్రంప్‌కుగానీ, ఇతర ఏ శక్తికిగానీ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే హక్కు లేదని ఎంపీలు స్పష్టంచేశారు. భారత్‌ను బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గనివ్వబోమన్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశాలో హిందూత్వ మూకలు రెచ్చిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరిట దూషణలు, దాడులను ఆపాలని వామపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.


