డా. ముచ్చుకోట సురేష్‌బాబు
వికసిత్ భారత్ బడ్జెట్ అంటూ ప్రచారం చేసిన ఈ బడ్జెట్లో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎలాంటి స్థానం కల్పించలేదు. రైతులు, కార్మికులు, చిన్నవ్యాపారులు, చిరువ్యాపారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఉత్పత్తి కులాల ఊపిరి తీసే బడ్జెట్ ఇది. చరిత్రలో అత్యంత దారుణమైన బడ్జెట్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇది ధనవంతుల కోసం, సంపన్నుల కోసం, భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం రూపొందించిన బడ్జెట్. ఉపాధి సృష్టిని ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రజల జేబులో డబ్బు లేకపోతే, బుల్లెట్ రైళ్లలో ఎలా ప్రయాణిస్తారు ? విద్యాబడ్జెట్ను కుదించారు. స్కాలర్షిప్లను తగ్గించారు. ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉన్నప్పుడే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది కానీ వారి హక్కులను లాక్కుంటూ కాదు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ నరేగా ద్వారా హామీ ఇచ్చిన ఉపాధి హక్కును ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల హక్కులను హరించేస్తోంది. ఉపాధి హక్కుని దూరం చేసిన ప్రభుత్వానికి ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడే అర్హత ఎలా ఉంటుంది ? ఉపాధి భద్రతను పునరుద్ధరించకుండా, రైతుల హక్కులు కాపాడకుండా, శ్రమ గౌరవాన్ని నిర్ధారించకుండా ఇలాంటి నినాదాలు ఎవరి కోసం. ఇది సామాన్య ప్రజల బడ్జెట్ కాదు. వికసిత్ భారత్ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూసేందుకు ఎవరైనా గ్రామాలకు వెళ్లారా ? జల్ జీవన్ మిషన్ అమల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నాయి.బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు, ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. సమాజంతో పాటు ప్రజల్లోనూ మార్పులొస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్ పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు, చేతివృత్తులు తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్,ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగునపడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు సా-మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. ఇలా చాలా వత్తులు దెబ్బతిన్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఏళ్ళు గడుస్తున్నా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తామనే ప్రకటన ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా, బీసీలకు రూ.లక్ష రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రుణాలు ఇస్తున్నారు. వారు వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు. పేదలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తిస్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తమ హక్కుల కోసం ఈ కులాలు ఉద్యమం చేయడం తప్పదు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిన అధిక ద్రవ్యోల్బణం, గరిష్ట స్థాయికి నిరుద్యోగం, ప్రజాస్వామ్యం అణచివేత, విద్వేష రాజకీయాలు, భారీగా పతనమైన రూపాయి విలువ, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, సమాజంలో విభజన, దేశ భద్రతలో వైఫల్యం, అధŠఃపాతాళానికి ఆర్థిక ప్రగతి వెరసి ప్రభుత్వాలు అన్ని రంగాల్లో వైఫల్యం చెందాయి. దేశ సంపద సృష్టించడంలో, దేశాన్ని నిర్మించడంలో వెనుకబడిన కులాల పాత్ర శ్లాఘించదగ్గది. ఇలాంటి కులాల సంక్షేమం విస్మరిస్తే దేశ భవిష్యత్తు అధోగతే. సెల్ : 9989988912


