Homeఎంఎస్‌ఎంఈలకు రాయితీల గ్రహణం

ఎంఎస్‌ఎంఈలకు రాయితీల గ్రహణం

- Advertisement -

రూ.700 కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు
మూడేళ్లలో 4,520 యూనిట్లు మూత… 48,477 మంది రోడ్డున
చితికిపోతున్న ఎంఎస్‌ఎంఈలు… తలుపులేస్తున్న సూక్ష్మ పరిశ్రమలు
తీవ్ర ఆందోళనలో ఎస్‌సీ, ఎస్‌టీ పారిశ్రామిక వేత్తలు

విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎం ఈ) మనుగడ తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తామని, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలు ఒక్కొకక్కటిగా తలుపులు మూసేస్తున్నాయి. నష్టాలు తాళలేక, అప్పుల ఊబిలో కూరుకు పోయి 2024 మార్చి నుంచి 2026 జూన్ వరకు గడిచిన 28 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4,520 ఎంఎస్‌ఎంఈలు మూతప డ్డాయి. ఈ మూతవేతల కారణంగా వాటిలో పని చేస్తున్న 48,477 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అధికారిక లెక్కల్లోకి రాని సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటే క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పరిశ్రమలు, రోడ్డున పడ్డ కుటుం బాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూతపడుతున్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య ఏటికేడాది ఆందోళనకర రీతిలో పెరుగు తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,401 సంస్థలు మూత పడి 22,120 మంది ఉద్యోగులు వీధిన పడగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య మరింత దారుణంగా పెరిగి 2,407 సంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల మరో 20,473 మంది ఉపాధికి గండిపడింది. ఇక ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేవలం మొదటి త్రైమాసికం (జూన్ వరకు) పూర్తికాకముందే మరో 712 సంస్థలు మూతపడటం, 5,88 4 మంది ఉపాధి కోల్పోవడం పరిశ్రమల ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. మూతపడిన సంస్థల్లో అత్యధికంగా స్వయం ఉపాధితో, అతి తక్కువ పెట్టుబడులతో నడిచే సూక్ష్మ పరిశ్రమలే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024-25 లో 1,388 సూక్ష్మ పరిశ్రమలు మూతపడగా, 2025-26 లో ఈ సంఖ్య ఏకంగా 2,397 కు చేరింది. 2026-27 జూన్ నాటికే మరో 706 సూక్ష్మ పరిశ్రమలు మూతపడ గా, చిన్న పరిశ్రమల విషయంలోనూ అదే తరహా ప్రతికూల వాతావరణం నెలకొంది. మూడు కాలాల్లో కలిపి మొత్తం 29 చిన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి. ముఖ్యంగా మూతపడిన యూనిట్ల లో ఎస్‌సీ, ఎస్‌టీ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సంస్థలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
అధికారుల నుంచి స్పందన కరువు
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు ఈ స్థాయిలో సంక్షోభంలోకి జారడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పారిశ్రామిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సిన ప్రోత్సా హకాలు, రాయితీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటికీ ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు రాయితీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల శాఖ కార్యాలయాల వద్ద అనేక సార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా అధికారుల నుంచి స్పందన కరువైంది. రావాల్సిన రాయితీలు నిలిచిపోవడంతో బ్యాంకుల రుణాల కిస్తీలు, విద్యుత్ బిల్లులు, ముడిసరుకు వ్యయం, పని చేసే సిబ్బందికి జీతాలు చెల్లించలేక యజమానులు పరిశ్రమలను మూసివేయ డమే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారు. చిన్న వ్యాపారులు, తయారీ యూనిట్లు, స్థానిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు, మార్కెటింగ్ వసతులు, విద్యుత్, ముడిస రుకు నిర్వహణ వ్యయాలలో ఎదురవుతున్న సమస్యలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాలు తగిన పరిష్కారాన్ని చూపలేకపోతున్నాయి. ప్రత్యేకించి అనంత పురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు, ఆక్వా కల్చర్ ప్రాసె సర్లు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొం టున్న ప్రత్యేక సమస్యలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పష్టమైన అంచనా లేదు. అలాగే సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక కేంద్ర ఉపశమన ప్యాకేజీ గానీ, ప్రత్యేక సీజీటీఎంఎస్ఈ పునర్నిర్మాణ సదు పాయం గానీ ఇచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టమయింది. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి, పెండింగ్ రాయితీలను వెంటనే విడుదల చేసి ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పునరుద్ధరించా లని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు