చెన్నై: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను (101) బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యం, వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం ఫిబ్రవరి 1న చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికిలో నల్లకన్ను చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా… పత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదు. పరిస్థితి మరింత క్షీణించి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్. నల్లకన్ను… ఆరఎన్కేగా అందరికీ సుపరిచితులు. ఆయనకు ఆండాళ్, కాశీ భారతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య రంజితం అమ్మాళ్ 2016లో మరణించారు. ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేశారు. కాగా, 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం, సాయుధ పోరాటాల తర్వాత 1949-50లో అనేకమంది కమ్యూనిస్టు నేతలను అరెస్టు చేశారు. వీరిలో ఆర్.నల్లకన్ను కూడా ఉన్నారు. ఆయనకు అప్ప్పుడు జీవిత కాలం (14 ఏళ్లు) జైలు శిక్ష పడింది. ఆయనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆయన పెదవిని సైతం ఓ పోలీసు అధికారి కాల్చారు. ఏడేళ్ల శిక్ష అనంతరం నిర్దోషిగా విడుదలయ్యారు. 1952లో ఈ కేసు ముగిసింది. ఈ ఘటన తమిళనాడులో చారిత్రకంగా నిలిచిపోయింది.


