ప్రొఫెసర్ పీటాబాబీవర్ధన్
ఏ దేశానికైనా వారసత్వ సంపద కళారూపాలే. ఇవి మానసిక వికాసానికి దోహదపడతాయి. 4 వేల సంత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ కళలు కొన్ని కనుమరుగైపోయినా, ఇంకొన్ని వేర్వేరు రూపాల్లో సజీవంగానే ఉన్నాయి. ఇప్పటి కదిలే బొమ్మల వెండితెర సినిమాల అభివృద్ధికి ఒకనాటి నాటకాలే. తొలినాళ్లలో ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించేందుకు, మార్గదర్శనం చేసేందుకు ఉపయోగపడ్డాయి. జాతీయోద్యమంలో కళలు ప్రజల్ని ఉత్తేజపరిచి, ఉద్యమం వైపు నడిపించేలా స్ఫూర్తిని నింపాయి. అక్షరాశ్యత శాతం తక్కువగా ఉన్న దశలో ప్రజాకళలే జనజాగృతికి బాటలు వేశాయి. ఆ తర్వాత కాలంలో సామాజిక రుగ్మతలను ఇతివృత్తాలుగా చేసుకుని రాసి ప్రదర్శించిన కన్యాశుల్కం, చింతామణి, మాలపల్లి, వరవిక్రయం, రక్తకన్నీరు, కొడుకు పుట్టాల, వంటి నాటకాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ‘బుర్రకధలు’ గురించి చెప్ప్పుకుంటే ఒక ప్రధాన కథకుడు, ఇద్దరు వంతలు కలిసి భుజం మీద తంబుర, చేతి వేళ్లకు కంచు గిరికీలు(రింగులు)ధరించి కధాగానం చేస్తారు. “తందానా దేవ నందనానా”అంటూ వంత పాడడం వీరి పని. సంభాషణల రూపంలో సాగే బుర్రకధలు తొలినాళ్లలో పురాణగాధలకే పరిమితం అయ్యేవి. రాను రాను బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, బాలచంద్రుడు వంటి చారిత్రక వీరగాధల్ని గానం చేయడం మొదలైంది. ప్రేక్షకులు కునికిపాట్లు పడకుండా వంతల్లో ఒకరు ఏదో ఒక హాస్య కథను వినిపించేవారు. 1940లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహించిన బుర్రకధ బృందాలను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అడ్డగోలు పన్నుల విధానాన్ని ప్రశ్నించినందుకు కొన్నాళ్ళు బుర్రకధ మీద నిషేధం విధించింది. తరువాత దశలో వామపక్షాలకు చెందిన కళా బృందాలు ప్రజాచైతన్యం కోసం ఆధునిక బుర్రకధలను ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ప్రజానాట్య మండలికి చెందిన ప్రముఖ బుర్రకధ కళాకారుడు పద్మశ్రీ షేక్ నాజర్ సామాజిక అంశాలను గానం చేయడం 1965-85 మధ్యకాలంలో విపరీతమైన ఆదరణకు నోచుకుంది. గ్రామాలకే పరిమితమైన ‘బుర్రకధలు’ పట్టణ, నగరప్రాంతాలకు సైతం చేరాయి. అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగం, కట్నాల కష్టాలు, అంటరానితనం, బెంగాల్ కరవు వంటి సమస్యలే ఇతివృత్తాలుగా బుర్రకధలు ఆధునికతను సంతరించుకుని, ప్రేక్షకాదరణ పొందాయి. 1985లో అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేణుగోపాలరావు ఆహ్వానం మేరకు నాజర్ ఆంధ్ర విశ్వవిద్యాలం అంబేద్కర్ అసెంబ్లీ హాలులో గానం చేసిన’ఆధునిక బుర్రకధ’ ను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఆస్వాదించడం ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉత్తరాంధ్రకి చెందిన ‘కుమ్మరి మాస్టారు’ బృందం చాలా కాలం పాటు బుర్రకధలు గానం చేసి ప్రేక్షకాదరణ పొందారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న నాటి కళారూపం నేడు మసకబారి కనుమరుగు అవుతుండడం విచారకరం. తెలంగాణకి చెందిన ‘ఒగ్గు కధ’కు ఆంధ్రప్రదేశ్ బుర్రకధలకు సారూప్యత ఉంది. ఇక కీర్తిశేషులు వంగపండు ప్రసాదరావు, (ఉత్తరాంధ్ర)అమరుడు గద్దర్ (తెలంగాణ), శ్రీ గోరటి వెంకన్న తదితర ప్రజాకళారులు కధాగానంలో విప్లవాన్ని రంగరించి ప్రజల్ని ఉత్తేజపరిచి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పగటి వేషాలు, పిట్టల దొర, బుడబుక్కలు, దొమ్మరాటలు, పులి వేషాలు, వగైరాలు ప్రాచుర్యం పొందిన కళారూపాలు. రైతుల పంటలు చేతికొచ్చే సమయానికి వీరు ఊళ్లలో తిరుగుతూ గాన, వాచక ప్రక్రియల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. మెచ్చుకోలుగా రైతులు వీరికి ధన ధాన్యసాయం చేస్తారు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, అభిమన్యుడు, తాటకి, సూర్పణక వంటి పౌరాణిక పాత్రల వేషాధారణలతో ఇల్లిల్లు తిరిగి యాచన చేసే కళారూపం ‘పగటి వేషాలు’. పిట్టలదొర ధనసంపదలు ఉన్నాయని విర్రవీగి దుబారా చేస్తే ఎదురయ్యే విపత్కర పరిస్థితులను వ్యంగంగా ప్రదర్శించే ‘సోలో కధ’. చిన్నపాటి సర్కస్ని కళ్ళముందుంచే కళారూపం ‘దొమ్మరాట’. తీగల మీద పొడవాటి వెదురు బొంగు సాయంతో ఒకవైపు నుంచి మరో పక్కకు నడిచే సాహస క్రీడ ఇది. బుగతలు, భూస్వాముల దాహానికి బలైపోయేవారు. ఇప్పుడు పరిస్థితులు మారి ఉద్యోగాలు చేసి జీవనం సాగించే స్థితికి రావడం శుభపరిణామని చెప్పాలి. వీరి జీవితాల ఆధారంగా ‘సీతా ఔర్ గీతా’ పేరుతో హిందీలోనూ, గంగ మంగ, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు తెలుగులోనూ రూపొందించిన విషయం తెలిసిందే. ఇక చెక్క భజన, కోలాటం, తప్పెట గుళ్ళు వంటి కళారూపాలు లయబద్దంగా సాగే నాట్య ప్రధాన కళారూపాలు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్టాల్లో ప్రాచుర్యం పొందిన ప్రాచీన కళారూపం జాతర. తెలంగాణాలో బోనాలు సమర్పించడం, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో, లక్ష్మమ్మ, రేణుకమ్మ, పోలేరమ్మ, పైడి తల్లి, పోలమాంబ, గైరమ్మ వంటి గ్రామదేవతల ఉత్సవాలు నిర్వహించడం ‘జాతర’ గా చెప్పొచ్చు. ఇక ఔరంగజేబు కాలం నాటి మరో ప్రాచీన కళారూపం ‘తమాషా’. యుద్ధంలో అలసిపోయిన సైనికులకు ఉల్లాసం,ఉత్సాహం కలిగించేందుకు ప్రదర్శించే కళారూపం. ఫ్యూడల్ సమాజపు దేవదాసీ సంస్కృతి కూడా దీన్నుంచి వచ్చిందే. కడ జాతి అమ్మాయిలు తమాషాలో దోపిడీకి గురవుతున్న దాష్టికాలకు వ్యతిరేకంగా రాంజోషీ, అనంత్ జోషి, ప్రభాకర్ జోషి సోదరత్రయం తిరుగుబాటు చేసి ఎందరో యువతులకు విముక్తి కలిగించారు. తమాషా అనేది 18వ శతాబ్దపు వికృత క్రీడ. 19వ శతాబ్దపు ఆరంభం నాటికి ఈ కళ మెల్లగా అంతరించి భక్తిభావంలోకి మారేలా కృషి చేసిన మహనీయులు ‘జోషీ బ్రదర్స’. మన ప్రాంతాల్లోని ‘జోగినీ, భోగం,కళావంతుల, వృత్తి వ్యాపకాలను కూడా ప్రభుత్వాలు నిషేదించడానికి జోషీలే మార్గనిర్దేశం చేశారని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో గరగ నృత్యం, డప్పు నాట్యం, బుట్టబొమ్మలాట, పల్లెసుద్దులు, ఒగ్గుకధ, జముకుల కధ, భామాకలాపం, తూర్పుబాగోతం, వంటివి ప్రాచుర్యం పొందాయి. కర్ణాటకలోని బళ్ళారి యాక్షగానానికి జన్మ స్థలమని చెప్పొచ్చు. వస్త్రాలంకరణ, హావభావాలు ప్రధానంగా సాగే యక్షగానం శైవ సంస్కృతిని ప్రధాన వస్తువుగా మిళితం చేసి ప్రదర్శింప బడుతుంది. హరికథ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన భక్తిప్రధాన కళారూపం. హరికథా పితామహునిగా పేరు గాంచిన ఆదిభట్ల శ్రీ నారాయణ దాస్(విజయనగరం) మేధో మధనం లోంచి అవతరించిన ‘హరికథ’ ఎందరో భాగవతారులకు జీవనోపాధిగా మారడం సుకృతమే. ఇలా ఎన్నో ప్రాచీన కళారూపాలు ఇప్పటికీ అజరామరమై అలరిస్తున్నాయి.
జర్నలిజం పూర్వపు విభాగాధిపతి, డీన్ 9393100566


