Homeచట్టబద్ధ పాలన హైజాక్

చట్టబద్ధ పాలన హైజాక్

- Advertisement -

. ప్రజా సమస్యలు పక్కదారి
. మోహన్‌బాబు, విష్ణును అరెస్టు చేయాలి
. ఉద్యమకారులపై అక్రమ కేసులు ఎత్తేయాలి
. 12న సార్వత్రిక సమ్మెకు మద్దతు
. అమెరికాకు మోదీ దాసోహం
. వామపక్ష పార్టీ నేతలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో చట్టబద్ధపాలన దారితప్ప్పుతోందని, అక్రమ కేసులు, ఘర్షణల చుట్టూ తిప్ప్పుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీ నాయకుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్, ఎం.రామకష్ణ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు డి.హరినాథ్, ఆరఎస్‌పీ నాయకులు జానకిరాములు, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకులు పీవీ సుందరరామరాజు, ఎంసీపీఐ(యూ) నాయకులు ఖాదర్‌భాషా, చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు అమర్‌నాథ్, సుధీర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రామకష్ణ పాల్గొన్నారు. సినీనటుడు మోహన్‌బాబు యూనివర్సిటీ అరాచకం, ప్రజాతంత్ర ఉద్యమకారులపై అక్రమ కేసులు, ఈనెల 12న జరిగే సమ్మెకు మద్దతు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం బాలోత్సవ భవన్‌లో వామపక్ష నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలతోపాటు మేధావులు, దేశహితం కోరే వారంతా సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలపాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై పెద్దఎత్తున నిర్బంధం కొనసాగిస్తోందన్నారు. అనకాపల్లిలో రైతుసంఘం నాయకుడు అప్పలరాజుపైనా, గత ప్రభుత్వంలో బైజూస్ సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా విశాఖలో ఆందోళనలు చేసిన సీపీఐ నాయకులపై రౌడీషీట్లు తెరవడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై ఆందోళనకు దిగిన సీపీఐ డోన్ కార్యదర్శి నారాయణపై సీఐ ఇంతియాజ్ దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రాంతాల్లోను కమ్యూనిస్టులపైనా, ఉద్యమకారులపైనా తీవ్ర నిర్బంధం కొనసాగుతోందని ఈశ్వరయ్య మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్నామని చెప్పిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆ విషయాన్ని మరచి… ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా ఉద్యమకారులపై పీడీ యాక్టులెలా పెడతారని సూటిగా ప్రశ్నించారు. మోహన్‌బాబు యూనివర్సిటీ అన్యాయాల్ని ప్రశ్నించినందుకుగాను ఏఐఎసఎఫ్, ఎసఎఫఐ ఉద్యమిస్తుండగా… దీనిపై కక్షకట్టి ఇటీవల ఎసఎఫఐ నాయకులు అక్బర్, వినోద్‌లను కిడ్నాప్ చేశారన్నారు. ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధ విధానాలపై ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ నాయకులు బూతులు తిట్టుకుంటూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి పోలీసులు వేగంగా స్పందించి విద్యార్థులను కాపాడారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రూల్ ఆఫ్‌లా హైజాక్ అయిందని, చట్టబద్ధపాలన జరుగుతుందా అనే అనుమానం వస్తోందని ఆరోపించారు. యథేచ్ఛగా దోచుకుంటూ కార్పొరేట్లకు భూములు కట్టబెడుతూ ప్రశ్నించిన వారిపై కేసులుపెట్టి జైళ్లలో వేస్తున్నారని అన్నారు. ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటూ విద్యార్థులను హింసిస్తూ, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ అన్యాయాలపై ప్రశ్నించిన ఎసఎఫఐ నాయకులు అక్బర్, వినోద్‌లను యూనివర్సిటీ గూండాలు కిడ్నాప్‌చేసి… అడవుల్లో తిప్పి… తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారన్నారు. యూనివర్సిటీలో విద్యాబుద్దులు చెబుతున్నారా? రౌడీయిజం చేస్తున్నారా? అనే అనుమానం వస్తోందన్నారు. పోలీసులు తక్షణం స్పందించకపోతే విద్యార్థులను చంపేసేవారని, కిడ్నాప్‌కు ముందు పథకం ప్రకారం విద్యార్థి నాయకులను హత్య చేసేందుకు కుట్రపన్నారని తెలిపారు. యూనివర్సిటీలో బౌన్సర్లను పెట్టి విద్యార్థులను, తల్లిదండ్రులను బెదిరించడం చట్టవిరుద్ధమన్నారు. అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లిలో రైతు సంఘం నాయకులు అప్పలరాజును పీడీ యాక్టు కింద అరెస్టు చేసి ములాఖత్‌కు అనుమతి ఇవ్వడం లేదని, నెలరోజుల తరువాత ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చారన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. దేశంపై 50 శాతం పన్నులు విధించిన ట్రంప్ 18 శాతానికి తగ్గిస్తే ప్రధాని మోదీ ఆనందపడుతున్నారని, చైనా దిగుమతులకు పన్నులే ఎత్తేశారనిమండిపడ్డారు. అమెరికాతో చేసుకున్న ప్రమాదకర ఒప్పందంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ ఒప్పందాన్ని బహిర్గతం చేయడానికి మోదీ భయపడుతున్నారన్నారు. దీని ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా, టెక్స్‌టైల్స్, డెయిరీ రంగం దెబ్బతింటుందన్నారు. పి.ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం నిర్బంధ ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, భూములను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్రంలో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామికవాదులు, ప్రజలు ఈ పోరాటంలో కలిసి రావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు