వి. శంకరయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి సందర్భంగా తన స్వస్థలం నారావారిపల్లెలో బస చేసినపుడు తిరుపతి తిరుమల తాగునీటి పథకానికి పునాదిరాయి వేశారు. తిరుపతి తిరుమలకు తాగునీరు సరఫరా చేస్తున్న కళ్యాణి జలాశయానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారని జలవనరుల శాఖ ప్రకటించింది. హంద్రీనీవా ఫేజ్ టు లో భాగమైన నీవా బ్రాంచి కెనాల్ నుంచి ఈ పథకం మొదలౌతుందని 126 కోట్ల వ్యయంతో ఈ పథకం రూపకల్పన చేసినట్లు ప్రకటించారు. వాస్తవంలో తిరుపతికి తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపుదిద్దుకోలేదు. రాజకీయ ప్రచారం కోసం లేక కాంట్రాక్టర్లుగా అవతారమెత్తే రాజకీయ నాయకుల స్వార్థం కోసం లేదా చంద్రగిరి నియోజకవర్గం కోసం జలవనరుల శాఖ ఈ పథకం తయారుచేసింది. తిరుపతి తాగునీటి సరఫరా బోగీ తగిలించితే సులభంగా ఆమోదం పొందుతుందని ఈ పథకం రూపొందించారు. విషాదమేమంటే ఇంత జరుగుతుంటే తిరుపతిలోని రాజకీయ పార్టీల నాయకులు తుదకు పౌరసమాజం ఏమాత్రం స్పందించకపోవడమే. ఎందుకంటే గాలేరు నగరి రెండవ దశ పథకం కింద గ్రావెటీతో బాలాజీ రిజర్వాయర్ మూడు టియంసిలు నీళ్లు నిల్వ సామర్థ్యంతో నిర్మాణంలో వుంది. ఈ రిజర్వాయర్ డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద 150 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచారు. ఈపాటికే ఈ రిజర్వాయర్ పై దాదాపు 50 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దురదృష్టమేమంటే 2019లో అధికారం చేపట్టిన జగన్మోహన్రెడ్డి కక్షకట్టి బాలాజీ రిజర్వాయర్ టెండర్‌తో సహా గాలేరు నగరి రెండవ దశలోని టెండర్లు అన్ని రద్దు చేసి “పుణ్యం” కట్టుకున్నారు. దానితో బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం మూలనపడింది. మరో విశేషమేమంటే గాలేరు నగరి పథకం ద్వారా కృష్ణాజలాలు రాకున్నా ఒక టియంసిల నీరు నిల్వ చేసేందుకు కాచ్మెంట్ ఏరియా బాలాజీ రిజర్వాయర్‌కు వుంది. గాలేరు నగరి పథకంలో భాగంగా కడప జిల్లాలో 300కిలోమీటర్ల దూరంలో 26టియంసిలు నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి వుంది. అంతేకాదు కృష్ణాజలాలు గ్రావెటీతో భేషుగ్గా నీళ్లు బాలాజీ రిజర్వాయర్‌కు వచ్చే అవకాశం ఉంది. అంతవరకైతే ఫర్వాలేదు. సరిగ్గా అయిదు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా గాలేరు నగరి రెండవ దశ పథకం ద్వారా మేర్లపాక చెరువు నుంచి మల్లిమడుగు రిజర్వాయర్‌కు అచ్చట నుంచి బాలాజీ రిజర్వాయర్‌కు నీళ్లు తరలించి తిరుపతి తిరుమల దాహార్తి తీర్చుతామని ప్రకటన చేసి వున్నారు. తమాషా ఏమంటే అదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి సందర్భంగా స్వస్థలం నారావారిపల్లెలో బస చేసినపుడు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలు అనేక ఎత్తిపోతలు పైగా 600కిలోమీటర్ల దూరం నుంచి కళ్యాణి జలాశయానికి కృష్ణా జలాలు తరలించి తిరుపతి తిరుమల దాహార్తి తీర్చుతామని ప్రకటించారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అయిదారు నెలల క్రితం తిరుపతి పర్యటన సందర్భంగా తను చేసిన ప్రకటన గుర్తు వుండకపోవచ్చు. రాష్ట్ర జల వనరుల శాఖాధికారులకు తెలియదా ? పోనీ తిరుపతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గం తాగునీటి పథకాల గురించి కనీస జ్ఞానం వున్నట్లు లేదు ! లేకుంటే ఒక రిజర్వాయర్ నిర్మాణం అర్థాంతంగా ఆగినపుడు మరొక పథకం ప్రకటన ఏలా ఆమోదించారు ? ఇంత క్రితమే బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంలో వున్నదని తెలుసా ? గత అయిదారు నెలల క్రితం ముఖ్యమంత్రి ప్రకటన గుర్తు లేదా ? తిరుపతి టీడీపీ¾ నాయకులైనా ఇలాంటి విషయాలు పట్టించుకోరా ?
విషాదమేమంటే తిరుపతి పౌరసమాజం కూడా మూగపోయిందా ? లేక ముఖ్యమంత్రి పునాది రాయి వేసిన పథకం ఉత్తుత్తి కింద జమ కట్టారా ? కనీసం తిరుపతిలోని ప్రతిపక్షాలు కూడా స్పందించిన దాఖలా లేదు. ఇవన్నీ అటుండగా రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు తిరుపతి తిరుమల శాశ్వత తాగునీటి వసతి కోసం బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం ఒకటి వుండగా మరల ఇంకొక ప్రతిపాదన తెర మీదకు ఎందుకు తెచ్చారు ? కేవలం రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగి లేదా కొందరు కాంట్రాక్టర్ల లబ్ది కోసం రెండవ ప్రతిపాదన రూపొందించారా ? సరిగ్గా అయిదారు నెలల క్రితం తాము ఇచ్చిన సమాచారంతోనే కదా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాలాజీ రిజర్వాయర్ గురించి తిరుపతిలో ప్రకటన చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖలో ఏం జరుగుతోంది ? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి రాలేదా ? లేదా బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో రద్దు చేశారా ? గాలేరు నగరి పథకంలో రెండవ దశకు పది టియంసిలు కేటాయింపు వుంది. ఆరు రిజర్వాయర్లు నిర్మాణంలో వుండగా అందులో బాలాజీ రిజర్వాయర్ మూడు టియంసిలు నిల్వ సామర్థ్యంతో తిరుపతి తిరుమల తాగునీటి కోసం ప్రతిపాదించి నిర్మాణంలో వుంది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన పుణ్య క్షేత్రం తిరుపతికి రోజూ లక్ష మంది యాత్రికులు వస్తుంటారు. పైగా ఇటీవల ఈ ప్రాంతంలో విస్తారంగా పరిశ్రమలు వస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత గల తిరుపతి తిరుమల దాహార్తి తీర్చేందుకు 300కిలోమీటర్ల లోపు దూరం నుంచి గ్రావెటీతో తాగునీరు తీసుకురావడం ఉత్తమమా ? లేక 600 కిలోమీటర్ల నుంచి అదీ ఎత్తిపోతలతో అదీ ఒకటి కాదు దాదాపు ఏడెనిమిది ఎత్తిపోతలతో నీళ్లు తీసుకురావడం సులభమా ? సౌలభ్యమా ? ఒక వేళ బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదన విరమించుకొని వుంటే గాలేరు నగరి రెండవ దశకు మంగళం పాడతారా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే హంద్రీనీవా ప్రాజెక్టు జలాలు కళ్యాణి జలాశయానికి రావడం కుదరదు. హంద్రీనీవా ఎత్తిపోతలు కృష్ణానదిలో మల్యాల వద్ద మొదలౌతుంది. మల్యాల నుంచి కళ్యాణి జలాశయం దాదాపు 600కిలోమీటర్ల దూరంలో ఉంది.
పైగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం చిత్తూరు జిల్లా దాటి తిరుపతి జిల్లాలో ప్రవేశించాలి. ఈ మార్గ మధ్యలో దాదాపు ఏడెనిమిది ఎత్తిపోతలు వుంటాయి. ఇన్ని అగడ్తలు అడ్డంకులు దాటి కృష్ణాజలాలు కళ్యాణి జలాశయం మరీ నీటి ఎద్దడి రోజుల్లో నీళ్లు తీసుకు రావడం సాధ్యమేనా ? ఈ ఏడు కూటమి ప్రభుత్వం కుప్పంకు నీళ్లు తీసుకు పోయేందుకు కాలువ వెంబడి బందోబస్తు పెట్టుకొని నీళ్లు తరలించారు. ఫలితంగా ఎగువ ప్రాంతంలో వున్న అనంతపురం జిల్లాలో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకొనింది. ఇన్ని వైతరణి నదులు దాటవలసిన ఈ పథకం రూపకల్పన చేసిన ఇంజనీరింగ్ అధికారులకు సన్మానం చేయవలసి వుంది. విశ్రాంత పాత్రికేయుడు


