Homeసంపాదకీయందొంగల చేతిలో తాళం

దొంగల చేతిలో తాళం

- Advertisement -

అయోధ్య రామమందిరంలో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న వార్తలు వచ్చిన సరిగ్గా నెలరోజులకు రామమందిర తీర్థ ట్రస్ట్ సమావేశం సోమవారం జరిగింది. మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రామమందిర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించారు తప్ప శ్రీరాముడికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలు మాయమైన అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడినట్టు లేదు. ఎవరినీ శిక్షించినట్టు లేదు. చంపత్ రాయ్ రాజీనామాను స్వీకరించారు కానీ ఆయన మీద ఈగైనా వాలనివ్వలేదు. పైగా ఆయన కీర్తిగానంలో ఆ సమావేశం తరించిపోయింది. సమావేశం తరవాత ట్రస్ట్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చంపత్ రాయ్‌ను నోరారా కీర్తించారు. ఆయనను త్యాగధనుడు, తపస్వి లాంటి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన జాగ్రత్తగా వ్యవహరించకపోవడం తప్పేనన్నారు తప్ప ఆయనను మాట మాత్రంగా కూడా అభిశంసించలేదు. ట్రస్ట్ సమావేశం పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్న గోపాల్ రావ్ను తొలగించింది. ట్రస్ట్ తనంత తాను చేసిన మహత్కార్యం ఇదే. చంపత్ రాయ్ మొదలైన వారి మీద ఇప్పటిదాకా ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయడానికి కూడా ఉత్తs Áప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాహసించలేదు. సాహసించే అవకాశమూ లేదు. రామాలయ నిధులు, కానుకలు, చెల్లించిన మొక్కులు మాయమైపోవడం యోగీ ఆదిత్యనాథ్ ఏలుబడిలోనే జరిగిందిగా! దీన్ని నిరోధించడానికి ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు. రామమందిర నిర్మాణానికి ఓ ట్రస్ట్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు తీర్పులో చెప్పారు. అందుకని మోదీ ప్రభుత్వం ఆ పని చేసింది.
దానికి చంపత్ రాయ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన హయాంలోనే దేవుడి సొమ్ము దొంగ భక్తుల వేషంలో ఉన్న దయ్యాల పాలైంది. సోమవారం నాటి సమావేశంలో ముగ్గురు సభ్యుల కమిటీ మాత్రం ఏర్పాటుచేశారు. ఆ ముగ్గురు సభ్యులు రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త పేర్లను సూచిస్తారట. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే దేవుడి సొమ్ము దయ్యాల పాలైందని లోకం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్షాల వారిని దూషించడాన్ని మాత్రం ఈ సమావేశంలో విస్మరించలేదు. ఈ కమిటీ సమావేశం నిర్వహించిన తీరు చూస్తే అసలు దోషులను శిక్షించే అవకాశం చాలా తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే రామమందిర తీర్థ ట్రస్ట్‌లో సంఘ్ పరివార్‌తో పేగుబంధం లేని వారు ఎవరూ ఉన్నట్టు లేరు. అయితే రామాలయ ట్రస్ట్ ఎనిమిది మంది సిబ్బందిపై మాత్రం ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలైనాయి. దీన్నిబట్టి చిన్న చేపలు చిక్కి పెద్ద చేపలు తప్పించుకునే వల మాత్రమే విసిరారని స్పష్టం అవుతోంది. ఆ సిబ్బంది ఇళ్లలో దాడులు చేసి 80 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసుల ప్రమేయం ఉన్న దాఖలా లేదు. రామమందిర తీర్థ ట్రస్ట్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైన వారు సత్యం బయటపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఎన్కౌంటర్లకు, బుల్డోజర్లు నడిపించడంలో ప్రాశస్త్యం గల యోగీ ఆదిత్యనాథ్, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ అధికారంలో ఉన్నారన్న వాస్తవం వారికి తెలుసుగదా! రామమందిరంలో ఏదో గోల్‌మాల్ జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మొదటిసారి బయట పెట్టారనుకుంటున్నాం. కానీ ఈ విషయం అంతకన్నా కొద్ది రోజుల ముందే రామమందిరంలో పని చేసే కొంతమంది సిబ్బందికైనా తెలుసు. అక్కడ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వారిలో ఎక్కువ మంది స్థానికులే కనక విషయం బయటకు పొక్కకుండా ఉండదు. నిజానికి అభిషేక్ ఉపాధ్యాయ్ అనే ఒక స్థానిక పత్రికా రచయితే జూన్ ఆరంభంలోనే ఫేస్‌బుక్‌లో కాబోలు ఓ అంశం రాశారు. ఆయనకు మంచి జర్నలిస్టు అన్న పేరు ఉంది. ఆయనా ఎప్పుడో అరెస్టు కావాల్సింది. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వు కారణంగా బతికిపోయారు. ఆయన తాను రాస్తున్నది వాస్తవమేనని తెలిసినా తనకు ఓ కలొచ్చినట్టు అందులో రాములోరి సొమ్ము దోపిడీకి గురైనట్టు రాశారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్కు విషయం తెలియకుండా ఉంటుందనుకోవడం ఘోరమైన అమాయకత్వమే. అఖిలేశ్ కన్నా ముందే జరుగుతున్న దోపిడీకి అసలు బాధ్యుల దగ్గర నుంచి సామాన్యుల వరకు తెలియకుండా ఉండదు. కానీ ఎవరూ నోరు విప్పిన పాపాన పోలేదు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు నిజాన్ని గంప కింద కమ్మేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి మీద ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు. పోలీసులు ఆ దరిదాపుల్లో కూడా లేరు. యోగీ ప్రభుత్వం చేసిందల్లా ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడమే. సిట్ నివేదికా వచ్చింది. వాస్తవం ఏమిటంటే ఇలాంటి విషయాల్లో ఎఫ్.ఐ.ఆర్. దాఖలు కాకుండా సిట్ ఏర్పాటుచేయరు. కానీ తమ వారిని కాపాడుకోవాలని ఏలిన వారు అనుకున్నప్పుడు ఏ నియమమూ వర్తించదు. అయినా ప్రభుత్వం చలించలేదు. ఈ తతంగంలో దిల్లీ పెద్దల పాత్ర కూడా ఉండొచ్చున్న వార్తలు వస్తున్నాయి కనక ఎంత సాహసికుడైనా యోగీ ఆదిత్యనాథ్ తనకు మాలిన ధర్మాన్ని భుజాన వేసుకోలేరుగా! కింది స్థాయి ఉద్యోగుల మీద మాత్రం ఎఫ్.ఐ.ఆర్. దాఖలైనట్టు ఉంది. అయితే ఇప్పటికీ పోలీసులు వారిని తమ రిమాండుకు పంపించాలని అడగకపోవడం మరో విచిత్రం. మరీ విచిత్రం ఏమిటంటే ట్రస్ట్ కోశాధికారి స్వామీ గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తాను కోశాధికారినే అయినా చెక్కు బుక్‌కు పై తన సంతకం ఉండదని వాదిస్తున్నారు. ఆయన పుణేలో ఉంటారట. నెలకోసారి చుట్టపు చూపుగా వచ్చి పోతుంటారట. మరి కోశాధికారిగా ఎందుకున్నట్టో. ఆయన బదులు ఎవరు వ్యవహారం నడిపిస్తున్నట్టు? ఇప్పుడు బయటపడ్డ కుంభకోణం కన్నా రామమందిర నిర్మాణ క్రమంలో, మందిరం కోసం భూముల కొనుగోలులో జరిగిన అవకతవకలు చాలా భారీ స్థాయివి అంటున్నారు. భూములు కొన్నప్పుడు కారు చౌకగా కొన్న నిమిషాల్లోనే తొమ్మిది పది రెట్ల ఎక్కువ ధరకు రామమందిర ట్రస్ట్ చేత కొనిపించారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. మందిర నిర్మాణం కోసం అవసరమైన నిర్మాణ సామాగ్రి కొనుగోలులో 40 శాతం కమిషన్లు తీసుకున్నారంటున్నారు. రామ భక్తులం అని చెప్పుకునే వారికి కళ్లెం వేసేది ఎవరో చూడాలి. ఎందుకంటే తాళం దొంగల చేతుల్లోనే ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు