Homeవిశ్లేషణనిధి చాల సుఖమే !

నిధి చాల సుఖమే !

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

రోజూ వచ్చే రోడ్డు మీద జనం గుంపులుగా ఉండడంతో దారి మార్చి మరో రోడ్డెక్కింది డాగీ. జనం ఉన్న ఆ రోడ్డు చివర ఓ గుడి ఉంది. బహుశా ఏదైనా ఉత్సవం జరుగుతున్నదేమో అనుకుంటూ వచ్చి అరుగు ఎక్కింది. మైదానంలోకి ఆ పక్క నించి వచ్చే వాడివి వెనుక వైపు నుంచి వచ్చావేం అనడిగింది డాంకీ. నువ్వు వచ్చే దారి వేరు. నేను వచ్చే దారిలో గుడి ఉంటుందే ఆ రోడ్డు మీద జనం బాగా ఉండటంతో దారి మార్చి ఇలా వచ్చా. ఓహో అదా విషయం. ఆ గుళ్లో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయనుకుంటాను అంది డాంకీ. ఆ గుళ్లో ఏ దేవుడు ఉంటాడేంటి అని ఆరా తీసింది డాగీ. మనుషులు రకరకాల దేవుళ్లని వేరువేరు గుళ్లల్లో ఉంచి పూజిస్తారు. ఈ గుడి రాముల వారి గుడి. అలాగా రాముడంటే చేతిలో బాణం ఉండే దేవుడేగా అంటూ కూచుంది డాగీ. రాముడేగా అనకు ఆయనే ఇప్పుడు పాప్యులర్. ఆయన గుడి కట్టడానికి ఎంత రాద్ధాంతం జరిగిందో నీకు తెలీదు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాంభజనే. జనం ఒకరినొకరు జైశ్రీరాం అని పలకరించుకుంటున్నారు కూడా. వాళ్లకు ఆపదలు గట్టెక్కించడానికీ, మొక్కిన వరాలు ఈయడానికీ దేవుళ్లున్నారు కాని మనకేరీ! ఎవరితో చెప్పుకుని ఏడుస్తాం అంది డాగీ. మనం దొరికింది తిని, తొంగోడం తప్ప ఏమి చెయ్యలేం. మనుషులకు భక్తి, మనకు భుక్తి అంతే అంది డాంకీ. అసలు ఈ భక్తి అంటే ఏమిటో ? మనకు లేనిదీ మనుషులకు ఉన్నదీ. మనం బడితెకు భయపడతాం. వాళ్లు దేవుడికి భయపడతారు. ఆ భయమే భక్తి. ఆ భక్తి పారవశ్యంలో భజనలు చేస్తారు. కీర్తనలు పాడతారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా!’ అని ఆ మధ్య మైదానంలో ఒకాయన పాడింది విన్నాం కదా! అంది డాంకీ. ఏమిటేమిటీ కీర్తనల దాకా వచ్చిందీ నీ సంగీత సాధన అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. రారా ! గుడికి వెళ్లొస్తున్నావా ? ప్రసాదం తెచ్చావా అంటూ నాలుక నోటి నుంచి జార్చింది డాగీ. ఆ జనంలో మనకెకక్కడ దొరికేను కానీ నిధి అంటున్నావు డాంకీ ఏంటా నిధి అనడిగాడు అబ్బాయి. అదే బ్రదర్ ! రాముడి సన్నిధి అన్నింటికన్నా గొప్పదనే కదా ఆ పాటకు అర్థం అంది డాంకీ ! కీర్తన సంగతి వదిలెయ్యి, రాముని సన్నిధి కన్నా ‘నిధే చాల సుఖమని తేలింది కదా అన్నాడు అబ్బాయి. “అదేవిటి భక్తినే శంకిస్తున్నావు అంది డాగీ. తప్పడం లేదు డాగీ, దేవుని హుండీలో డబ్బు మాయం చేసేస్తున్న వాళ్ల భక్తిని, భక్తి అనడానికి వీల్లేదు. అదో పెద్ద డ్రామా అనే అనాలి కదా నిజం భక్తే కాదు. భయమూ లేదు, దేవుడి సొమ్ము దోచుకోడానికి. నా వెనక కాళ్లకి చిక్కితే చెబుదును ఈ దొంగభక్తుల పని అంది డాంకీ. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు “ భక్తుల సొమ్ము భోక్తల పాలు” అవుతున్నది అన్నాడు అబ్బాయి. అదేంటి ‘బ్రో’ చేతిలో బాణమూ, త్రిశూలమూ గిరగిర తిరిగే చక్రమూ ఉన్న దేవుళ్లంటే భయమే లేదా వీళ్లకు అంది డాగీ . భయమా ? వీళ్లకి తెలుసు కదా రాయిలో ఉండే దేముడు కదిలిరాడని అందుకే ఎంత దోచుకున్నా ఏమీ చెయ్యడని ధీమా వీళ్లకి అన్నాడు అబ్బాయి. చిన్నాచితకా గుళ్లల్లో అలాగే దోచుకునే వాళ్లుంటారేమో కానీ ప్రసిద్ధమైన గుళ్ల జోలికి దేవుళ్ల జోలికి ఎవరు వెళ్తారులే అంది డాంకీ. చిల్లర డబ్బులు వచ్చే చిన్న దేవుళ్లూ, గుళ్లూ ఎవరిక్కావాలి, హుండీ నిండా బంగారము, వెండి నోట్ల కట్టలూ ఉండే గుళ్లే దోచుకోడానికి పనికి వస్తయని తయారయ్యేరు దోపిడీ దొంగలు. నిన్నా మొన్నా ఇంతింత కళ్లు తెర్చుకు చూస్తూ నిలబడిన బాలరాముడ్‌ని కూడా వదల్లేదు వీళ్లు. ఒకటా రెండా ఏడు కోట్ల రూపాయలు, సీసీ టీవీ కెమెరాలకు అడ్డం పడి నిలువునా దోచేసుకున్నారు. రెండు వందల కేజీల వెండి ఇటుకలను కూడా గప్చుప్‌గా చప్పరించేశారు అన్నాడు అబ్బాయి. భక్తినీ, పారవశ్యాన్ని జనాల నెత్తురులో “ఇంకింప” చేసి, వాళ్ల చేత హుండీలు నింపించి, దేవుడి సొమ్ము దోచుకుని లెక్కా డొక్కా లేకుండా తప్పించుకుంటున్నారన్న మాట ఛీ ఏం మనుషులు ! అంది డాగీ. నీకున్న విశ్వాసం వాళ్లకెలా అబ్బుతుంది డాగీ అంది డాంకీ. దేశంలో దొంగలు పడ్డారన్న మాట పాతదయింది. ఇప్పుడు దేవాలయాల్లో దొంగలు పడుతున్నారన్న మాట మామూలయ్యింది. ఈ దొంగలు ఏ దేవుణ్ణీ వదలడం లేదు. అయ్యప్ప బంగారం దోచుకున్నారు. గోవిందరాజ స్వామిని నిలువు దోపిడీ చేశారు. కలియుగ వైకుంఠంలో కల్తీ నెయ్యి బాగోతం అందరికీ తెల్సిందే. శ్రీశైలంలో రెండు కోట్ల విరాళాల సొమ్ము “హాంఫట్” అయింది. ఇక వరాహస్వామి దేవుడి మాన్యాల అన్యాక్రాంతం కథ పాతదే. ఇలాగ ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారుతోంది’ అన్న కవి మాటను నిజం చేస్తున్నారు అంటూ అరుగు దిగాడు అబ్బాయి. విన్నావుగా ! డాగీ మనకు దేవుడు లేడని వాపోయావుగా మనుషులు చూడు దేవుడ్‌ని ఎలా వాడుకుంటున్నారో అంది డాంకీ. అవును సుమా లేడు కనుక దోచుకోకుండా వాడుకోకుండా ఇలాగ ఉన్నాం. ఈ మనుషులు రాముడి సన్నిధి కంటే నిధి చాల సుఖం అనుకుంటారని అర్థమైందిలే అంది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు