రాజుల పాలనో, బ్రిటీషు వారి పాలనో నయం. అసలు ప్రజాస్వామ్యం ఇందుకేనా ? ఇంతకంటే నీచ రాజకీయాలు ఇక ముందు చూడం. ఏంటి బావ ఈరోజు ఉదయమే ప్రజాస్వామ్యం వద్దంటూ బయలుదేరావు. కాకపోతే ఏంటయ్యా మనల్ని మనమే మన అవసరాలు తీర్చుకొని మనల్ని మనమే పాలన చేసుకోమని ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాం. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వపడుతున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇతర దేశాలు మన ప్రజాస్వామ్య పాలన చూసి ఈర్ష్య పడుతుంటే మనమేంటి ఇలా తిట్టుకోవడం, తన్నుకోవడం. నిజమేనయ్యా మన పెద్దలు బ్రిటీషు వారిమీద ప్రాణాలకు తెగించి పోరాడి తెచ్చిన స్వాతంత్య్రం ఇలా రూపుదాల్చడం మన పెద్దలు తలవంచుకునే పరిస్థితి నెలకొంది. ప్రశ్నిస్తే దండన ప్రజాస్వామ్యానికి మారని మచ్చ. వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆ తరువాత కర్రలతో బరిసెలతో దాడులు చేసుకోవడం శోచనీయం. ఒక నాయకుడు అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే చట్టప్రకారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం సరైన విధానం. అంతేగాని సదరు నాయకునిపై కర్రలతో దాడి చేయడం ఆ వ్యక్తి ఇంటికి నిప్ప్పుపెట్టడం అమానుష చర్య. అనరాని మాటలన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సబబైన చర్యగా భావించాలి. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నేరస్తుడయితే అతనిపై దాడిచేసిన వ్యక్తులు నేరస్తులే కద. కానీ పోలీసులు దాడి చేసిన వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం పక్షపాత రాజకీయంగా పరిగణించాలి. ఏ పార్టీ నాయకుడైన ఇతర పార్టీ నాయకులను దూషిస్తే ఖచ్చితంగా అతనిపై పోలీసులు కేసుపెట్టి కోర్టుకు పంపవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే దురదష్టం ఏమిటంటే పోలీసులు ఇతర అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. అయితే ఇందుకు కారణం పాలనలో ఉన్న ప్రభుత్వాలది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులను అక్కున చేర్చుకొని వారికి ప్రమోషన్లు ఇవ్వడం న్యాయంగా నడుచుకున్న అధికారులపై శీతకన్ను వేయడం ప్రభుత్వానికి తగని పని. యధారాజా తధాప్రజా అన్నట్లుగా నేడు రాజకీయం నడుస్తోంది. ఇటువంటి పాలన కోసమేనా ప్రజాస్వామ్యం కోసం పోరాడిందని మేధావులు మదనపడుతున్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే అన్ని పార్టీల నాయకులకు మేధావులు గతంలో వలె మరల రాజకీయ శిక్షణా తరగతులు తీసుకొని ప్రజాస్వామ్యంలో ఎలా పనిచేయాలో ప్రజల అవసరాలు తీర్చడానికి ఏ రకమైన నాయకులను ఎన్నుకుని ప్రజల సంక్షేమమే ప్రధానంగా భావించి నిస్వార్థ రాజకీయ నాయకులను తయారుచేసుకోవలసిన తరుణం ఆసన్నమైందని పెద్దలు భావిస్తున్నారు.
గతంలో మనల్ని మనమే పరిపాలించుకోవాలని బ్రిటీషు వారిపై పోరాటం చేసి ఎందరో మహానుభావులు అసువులు కోల్పోయారు. వారి త్యాగ ఫలితం తిట్టుకోవడం, కొట్టుకోవడంగా మారడం గర్హించదగినది. సమాజం ఎందుకిలా మారుతోందో ఆలోచించాలి. వత్తులను బట్టి ఏర్పడ్డ కులాలు ప్రస్తుత సమాజానికి అవసరం లేదు. బస్సుల్లో, రైళ్లల్లో, హోటల్లో ఎక్కడా అడగని కులాలను రాజకీయాల కోసం నాయకులు తమ పబ్బం గడుపుకొని అధికారం కోసం పెంచి పోషిస్తున్నారు. అసలు రాజకీయానికి కులంతో పనిలేదు.
కాని నేటి రాజకీయ నాయకులు ప్రజలను కులాల వారీగా విభజించి పదవులిచ్చి, కులపిచ్చి ప్రజల్లో పెంచి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కులాల వారీగా ప్రభుత్వం పదవులు పంచడంతో కులగణన కోసం బీసీలు పట్టుబడుతున్నారు. తప్ప్పు చేసిన వారిపై చర్య తీసుకుంటే సదరు నిందితుడి కులం వారు ఆందోళన చేస్తున్నారు. గతంలో లేని కులమతాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెంచి పోషించడం తగని పని. సమాజ భవిత దష్టిలో ఉంచుకొని అన్ని పార్టీల నాయకులు సమావేశమై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. రాజకీయ ప్రక్షాళన అవసరం గుర్తించి తమ తమ పార్టీలలోని సభ్యులపై దష్టిపెట్టి ప్రవర్తన బాగులేని వారిని పార్టీ నుంచి తొలగించాలి. గతంలో చెడు ప్రవర్తన ఉన్నవారికి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం ఇచ్చేవారు కాదు. స్వార్థం, సొంత పనులు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేసేవారు. ప్రస్తుతం అలాకాక స్వార్థంతో సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. మంత్రుల దగ్గర నుంచి అట్టడుగు సామాన్య కార్యకర్త వరకు నాకేమిటి అని అడిగిన తరువాత రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ముందుగా ప్రక్షాళన పైనుంచి కిందకు జరగాలి. అప్ప్పుడే ప్రజాస్వామ్య అవసరం తెలిసి సద్వినియోగం చేసుకుంటారు. సెల్ : 9885569394
ప్రజాస్వామ్యం ఇందుకేనా?
- Advertisement -


