పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోవడం మీదే అందరి దృష్టీ ఉంది. సమగ్ర, సునిశిత ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మమతాబెనర్జీని గద్దె దించడానికి చేయగలిగిందల్లా చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని రెండు లక్షల 40 వేల భద్రతా దళాలను బెంగాల్‌లో నియోగించడం చూస్తే ఆ రాష్ట్రాన్ని యుద్ధ భూమిగా మార్చడానికి మోదీ ప్రభుత్వం ఏ అవకాశాన్నీ వదులుకోలేదనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భద్రతా దళాలను పిలిపించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను భారీ సంఖ్యలో నియోగించారు. కడకు ఓట్ల లెక్కింపు పరిశీలనా బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు, భద్రతా దళాలకే అప్పగించింది. మోదీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సకలవిధ సహకారమూ అందించారు. చివరకు మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో భవానీపూర్‌లో 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 లోనూ నందిగ్రాంలో మమతా బెనర్జీ అదే సువేందు చేతిలోనే ఓడి పోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డి.ఎం.కె. అధినేîత స్టాలిన్ సైతం కొలత్తూర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. తమిళనాడులో ప్రసిద్ధ సినీనటుడు విజయ్ కొత్త పార్టీ చరిత్ర సృష్టించింది. తమిళ నాడులో కొత్తగా రాజకీయ నాయకుడి అవతారమెత్తి తమిళగ వెట్రిగ కజగం (టి.వి.కె.) పార్టీ పెట్టిన విజయ్ ఎన్నికలను ముక్కోణపు పోటీగా మార్చేసి విజయం సాధించారు. తమిళనాడులో 1967 నుంచి రెండు ద్రావిడ పార్టీల మధ్యే పోటీ ఉండేది. అక్కడ జాతీయ పార్టీలకు స్థానమే లేకుండా పోయింది. ఈసారి విజయన్ నెలకొల్పిన మూడో పార్టీ విజయం సాధించడం ప్రత్యేకతే. తమిళ ఓటర్లు ద్రావిడ పార్టీల పరిధి దాటి పోలేదు. తనది సెక్యులర్ పార్టీ అని విజయ్ చెప్తున్నారు. సినీ రంగం లోంచి అమాంతం రాజకీయ రంగంలోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి అయిపోయిన వారిలో ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి. రామారావ్ అయితే ఇప్పుడు ఆ పని విజయ్ చేయగలిగారు. తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలో సత్తా చూపాలనుకున్న బీజేపీకి మళ్లీ చుక్కెదురైంది. కేరళలో వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన నియోజకవర్గంలో విజయం సాధించారు. కేరళలో ఒకసారి వామపక్షఫ్రంట్, మరోసారి కాంగ్రెస్ నాయకత్వంలోని యు.డి.ఎఫ్.అధికారంలోకి రావడం పరిపాటి. కానీ 2021 ఎన్నికలలో వామపక్ష ఫ్రంట్ వరసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించింది. ఈసారి యు.డి.ఎఫ్.కు అధికారం దక్కింది. బెంగాల్‌లో ఎలాగైనా మమతాబెనర్జీని గద్దె దించాలన్న బీజేపీ వ్యూహం ఫలించింది. దీనికోసం ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని ఎత్తులు ఎత్తాలో అన్నీ ఎత్తారు. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా వినియోగించు కున్నారు. బెంగాల్‌లో నిర్వహించిన సమగ్ర, సునిశిత ఓటర్ల జాబితా సవరణ లక్ష్యమే తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. మొదట దాదాపు 90 లక్షల మంది ఓటర్లను జాబితాలోంచి తొలగించారు. ఆ తరవాత తొలగించిన జాబితాలోంచి కొందరిని చేర్చారు. కానీ సందిగ్ధ ఓటర్ల జాబితాలో 27 లక్షల మంది మిగిలారు. ఈ వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు డజన్ల సంఖ్యలో జడ్జీలను నియమించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. కానీ 27 లక్షల మంది వివాదాస్పద సందిగ్ధ జాబితాలో ఉంటే ట్రిబ్యునల్ పరిష్కరించిన వివాదాలు వందల సంఖ్యలో కూడా లేవు. వెరసి ఆ 27 లక్షల మందిలో అత్యధికులు ఓటు వేయలేకపోయారు. సుప్రీంకోర్టు కర్కశంగా వచ్చేసారి వేయొచ్చులెండి అని అనడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేట్టు చేయడంలో సుప్రీంకోర్టు తన బాధ్యతను ఏమాత్రం నిర్వర్తించలేదు. దీన్నిబట్టి తమకు ఓటు వేయరు అనుకున్న వారి పేర్లను పనిగట్టుకుని తొలగించారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎస్.ఐ.ఆర్.చివరకు తృణమూల్ కాంగ్రెస్‌కు యమపాశమైంది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో రాజకీయ పార్టీల పలుకుబడి, పనితీరు కన్నా ఇతరేతర కారణాలే గెలు పోటములను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించినట్టు కనిపిస్తోంది. బెంగాల్‌లో బీజేపీని గెలిపించడంలో ఎన్నికల కమిషన్, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాత్ర కూడా బలీయమైందే. ఎస్.ఐ.ఆర్. అమలు కోసం ఆయన బెంగాల్‌కు కొత్త విధానాలు రూపొందించారు. జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక దఫాలు సుప్రీం కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఎస్.ఐ.ఆర్. వ్యవహారం సుప్రీం కోర్టు ముందు విచారణలో ఉంది. కానీ తీర్పు ఇంతవరకూ రానే లేదు. ఈలోగా ఎన్నికలు జరిగిపోయాయి. బీజేపీ ఒక రాష్ట్రం తరవాత మరో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటూనే ఉంది. తమిళనాడులో డి.ఎం.కె.నాయకత్వంలోని కూటమికి తిరుగు లేదు అనుకున్నప్పటికి చివరకు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొలత్తూర్‌లో ఓడిపోయారు. డి.ఎం.కె.మూడో స్థానంలోకి చేరుకోవలసి వచ్చింది. కేరళలో 2021ఎన్నికల్లో విజయం సాధించిన వామపక్ష ఫ్రంట్ వరసగా రెండోసారి గెలిచి కొత్త ఒరవడి సృష్టించింది. కానీ ఈసారి పినరయి విజయన్ నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్‌కు పరాజయం తప్పలేదు. ఎన్నికల కమిషన్ ఇంతవరకు అందించిన వివరాలను బట్టి చూస్తే బెంగాల్‌లో గెలిచిన బీజేపీకి, ఓడిన తృణమూల్ కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల అంతరం నామమాత్రంగానే ఉంది. బీజేపీ 45.3శాతం ఓట్లు సంపాదిస్తే తృణమూల్ 40.82శాతం ఓట్లు సాధించింది. తొలగించిన 27లక్షల ఓట్లు పోలైన ఓట్లలో నాలుగు శాతం దాకా ఉంటాయి. బెంగాల్‌లో విజయం కేవలం బీజేపీదే కాదు. ఈ విజయం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానిది. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరిది.


