Homeమరో 25 శాతం వడ్డన

మరో 25 శాతం వడ్డన

- Advertisement -

భారత్‌పై ట్రంప్‌ సుంకాల మోత
50 శాతానికి చేరిన టారిఫ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 శాతం సుంకం వర్తించనుంది. ఈ మేరకు బుధవారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్‌… 24 గంటల్లో భారత్‌పై భారీ టారిఫ్‌ వేస్తానని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నంత పనీ చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోళ్లు జరుపుతున్నందునే ఈ టారిఫ్‌ విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో ట్రంప్‌ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల్లో భాగంగా ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా… కొత్తగా విధించిన 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి వర్తింపజేస్తున్నట్లు ట్రంప్‌ తన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
ఒకవేళ ఈ సుంకాలకు ప్రతీకారంగా భారత్‌ ఏదైనా సుంకాలు వడ్డించాలని ప్రయత్నిస్తే ఈ టారిఫ్‌లను అధ్యక్షుడు సవరించొచ్చని వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే ఎత్తుగడలో భాగంగా ట్రంప్‌ ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు. తాజాగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయలేదన్న కారణంతో భారత్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్‌ మోపారు. దీంతో చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 51 శాతం సుంకం అమెరికా విధిస్తోంది. మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30, వియత్నాంపై 20 శాతం, ఇండోనేసియాపై 19 శాతం చొప్పున ట్రంప్‌ టారిఫ్‌ విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్‌పై 15 శాతం టారిఫ్‌ ప్రకటించారు.
ధైర్యం చూపండి: కాంగ్రెస్‌
తాజా పరిణామంపై కాంగ్రెస్‌ స్పందించింది. నరేంద్ర మోదీ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మొత్తంగా 50 శాతం సుంకం విధించారని తెలిపింది. ట్రంప్‌ నిరంతరం మన దేశంపై చర్యలు తీసుకుంటున్నా… ప్రధాని మోదీ మాత్రం కనీసం ఆయన పేరును కూడా ప్రస్తావించడం లేదని విమర్శించింది. ఇప్పటికైనా మోదీ ధైర్యం చూపించాలని, ట్రంప్‌ చర్యలకు తగిన సమాధానం ఇవ్వాలని కోరుతూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు