Homeసాహిత్యంమానవత్వపు మహావృక్షం…

మానవత్వపు మహావృక్షం…

- Advertisement -

దీర్ఘాలోచనలు అలలై ఎగసి పడుతున్నాయి
భావాలన్నీ రూపం దిద్దుకొని తాకేందుకు
ఎండిన చోట నీటి చుక్కలను పంచేందుకు
వసంతంగా మారి వనాలను సృష్టించేందుకు…

ఎగిసి పడే అలల ప్రేమ కౌగిలి
మట్టి మనసుల్లోనూ మొలకెత్తించు ప్రాణం
అలసిన హృదయములో జీవం పోసి
తన రెక్కలతో నింగినంతా తాకుతుంది…

మనసులో ఆనందపు పువ్వు వికసిస్తే
దేహమంతా సువాసనలు వ్యాపిస్తాయి
జీవన దృశ్య మాలికలో రంగులు నిండి
నీ బతుకు వనంలో వనమాలి ప్రవేశిస్తాడు..

కల్లోలాలను శాంతి రెక్కలతో ఆర్పితే
ప్రశాంతిని పాతాళం దాకా పంపవచ్చు
నిర్మలత్వంతో నేలపై జీవనం కొనసాగిస్తూ
మానవత్వాన్ని మహావృక్షంగా మలచవచ్చు…

చేతి స్పర్శలో పువ్వుల వర్షం కురిస్తే
కంటి చూపుల్లో ప్రేమతత్వం కనిపిస్తే
మాటల్లో తీయని మాధుర్యం వినిపిస్తే
ప్రపంచమంతా ఒకే వర్ణమై విరసిల్లుతుంది…

జీవితం మర్రిచెట్టు ఊడల్లా వ్యాపిస్తే
ఎన్నో ప్రాణులకు ఆసరై ఆనందాన్ని పంచుతుంది
సప్తవర్ణాలను సౌమ్యంగా స్వీకరిస్తే
జగతిలో అందరూ అన్నదమ్ముల్లా జీవిస్తారు…
కొప్పుల ప్రసాద్, 9885066235

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు