. జీడి పరిశ్రమల్లో అమలుకాని చట్టాలు
. వేతనాల కోసం నిత్యం పోరాటాలే
. ఐదు దశాబ్దాలుగా కాయకష్టం
. మారని కార్మికుల జీవనస్థితి
. కోట్లు కొల్లగొడుతున్న యాజమాన్యాలు… బ్రోకర్లు
. ప్రభుత్వ ఆదాయానికి గండి
జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు వర్తించవు. రెక్కాడితే గాని డొక్కాడని కష్ట జీవులు సుమారు ఐదు దశాబ్దాలుగా కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జీవనస్థితిలో మార్పు మచ్చుకైనా కానరావడం లేదు. వేతనాలు పెంచండి మహాప్రభు అంటూ పోరాడాల్సి వస్తోంది. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలూ ఉండవు. రోస్టెడ్ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వాయువు పీలుస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. యజమానులు మాత్రం లాభాలు గడిస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారు. మరికొందరు విదేశీ పప్ప్పుతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కొందరు బ్రోకర్లు … మాటలు కోటలు దాటించి కోట్లు సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కొందరు పరిశ్రమల యజమానులు తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బీద అరుపులు అరవడం కొసమెరుపు.
విశాలాంధ్ర-పలాస (శ్రీకాకుళs): పేరు వినగానే నోరూరించే జీడిపప్ప్పుకు బంగారానికి ఉన్నంత డిమాండ్ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం సంపూర్ణ పోషక విలువలు కలిగి ఉండటమే. ప్రపంచంలోనే మనదేశంలో పండించే జీడిపప్ప్పుకు రుచి ఎక్కువ. దేశంలోనే జీడిపప్ప్పు ఉత్పత్తిలో కేరళది మొదటి స్థానం కాగా, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జీడి ఉత్పత్తికి ప్రసిద్ది. జీడిగింజలు రైతులకు… జీడిపప్ప్పు ఉత్పత్తిదారులకు కల్పతరువుగా మారాయి. 50 ఏళ్ల క్రితం రెండు పరిశ్రమలు ఏర్పాటు కాగా… నేడు పలాస-కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో 300 పైచిలుకు పరిశ్రమలు జీడిపప్ప్పును ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జీడిపంట నాలుగు వేల హెక్టార్లలో పండుతోంది. 30 వేల టన్నుల జీడి పిక్కలు పరిశ్రమలకు చేరుతుంటాయి. జీడి గింజల పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 80 వేల మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. కష్టపడితే గానీ కడుపు నిండని పరిస్థితి. నాటి నుంచి వారి జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక్కడ చట్టాలు వర్తించవు. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రెండేళ్లకి ఒకసారి కనీస వేతనాల కోసం పోరాడవలసి వస్తుంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తున్నా… కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పరిశ్రమల యాజమాన్యాలకు ఖర్చులు పోను 30 శాతం పైగా లాభాలు వస్తున్నట్టు ఒక సర్వే స్పష్టం చేసింది. మరోవైపు చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా కొన్ని రాయితీలు తమకు అందడం లేదని పరిశ్రమదార్లు బీద అరుపులు అరుస్తున్నారు. కొంత మంది రెండోరకం జీడిపప్ప్పులతో ప్రభుత్వ కళ్లు గప్పి వ్యాపారాలు చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రకృతి వైపరీత్యాల వలన జిల్లాలో జీడి పంట చాలా మేరకు నష్టపోవడంతో స్థానిక వ్యాపారులు విదేశీ జీడి పిక్కల పైనే ఆధార పడుతున్నారు. జిల్లాలో రోజుకు 60 టన్నుల జీడిపప్ప్పు ఉత్పత్తి అవుతోంది. స్థానికంగా లభ్యం కాకపోవడంతో విదేశీ జీడిపిక్కలను దళారుల ద్వారా దిగుమతి చేసుకుంటూ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. విదేశాలకే ఆ జీడిపప్ప్పును విక్రయిస్తూ పన్నుల నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఈ నిబంధన జీడి వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. పైసా పెట్టుబడి లేకుండా కేవలం సెల్ ఫోన్ పెట్టుబడిగా మాటలతోనే కోటలను దాటించి కోట్లు కొల్లగొడుతున్నారు బ్రోకర్లు. చివరకు వీరిపైనే ఆధారపడి జీడిపప్ప్పును అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఆదాయపు అధికారులు దష్టిపెడితే వీరి చీకటి వ్యాపారం బట్టబయలు అవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బాయిలింగ్ విధానంలో జీడి పిక్కలను రోస్టింగ్ చేయవలసి రావడంతో కాలుష్యం వెదజల్లుతోంది. కాల్చడం వలన కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. వీటిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాగా, హైకోర్ట్యు ఆదేశాలు దరిమిలా పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో రోస్టింగ్ విధానంతో నడుస్తున్న జీడి పరిశ్రమలు 14 ఏళ్ల క్రితం మూతపడ్డాయి. కొంతమంది బాయిలింగ్ విధానంలో జీడిపప్ప్పును ఉత్పత్తి చేస్తున్నారు. మరి కొందరు ఒడిశా గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు వేసి రోస్టింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రాష్ట్రంలో పన్నుల శాతం తక్కువగా ఉండటం కూడా వ్యాపారులకు కలిసి రావడంతో అక్కడే జీడిపప్ప్పు పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు.


