. కూటమి బలోపేతానికి ఐక్య కార్యక్రమాలు
. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చ
. రాజ్యసభ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా మంతనాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సీఎం నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టేలా క్షేత్రస్థాయిలోనూ, సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేలా రెండు పార్టీల వైపు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భావించారు. జనసేన పార్టీని కూటమి నుంచి విడగొడితేనే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఇటీవల విజయసాయిరెడ్డి మీడియా సమక్షంలోనే బహిరంగంగా మాట్లాడిన విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అలాగే వైసీపీకి అనుకూలంగా ఉన్నవారితో సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య వైరం పెంచేలా యూట్యూబ్‌ల్లో వస్తున్న వీడియోల పట్ల చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ వాడిన భాష, దానిని సమర్థిస్తూ ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యానాలు, తదనంతర పరిణామాలు, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక ఇచ్చిన అంశాలపై వైసీపీ వక్రీకరిస్తున్న తీరు, త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపైనా సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాశ్ చంద్రబోస్ జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. వారితోపాటు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్ పదవీకాలం కూడా ముగియనుంది. సతీశ్‌ను మరలా కొనసాగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండగా… మిగిలిన మూడింటిలో ఒక సీటు జనసేనకు కేటాయించాలని పవన్ కల్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా జనసేన తరపున కొన్ని పేర్లు పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ముఖ్యంగా వైసీపీ కుట్రలను ఛేదించేలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ఈ భేటీ సారాంశంగా నేతలు చెబుతున్నారు.


