Homeఅంతర్జాతీయం‘శాంతి’తోనే స్వర్గానికి: ట్రంప్‌

‘శాంతి’తోనే స్వర్గానికి: ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందం జరిగితే తనను స్వర్గానికి వెళ్లే మార్గం సుగమమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకునే యత్నంలో భాగంగానే మాస్కో-కీవ్‌ మధ్య శాంతి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ రెండు దేశాధ్యక్షులతోపాటు యూరోపియన్‌ నేతలతోనూ ఇటీవల చర్చలు జరిపారు. తన ప్రయత్నాలు జీవితానికి సంబంధించినవి కావని, అవి తన మోక్షమార్గానికి జరిగే ప్రయత్నాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను బాగా పనిచేయడం లేదట. ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది (శాంతి ఒప్పందం) ఉంటుంది’ అని ట్రంప్‌ వెల్లడిరచారు. కొన్నేళ్లుగా అనేక విమర్శలు, అభియోగాలు, కోర్టు కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్‌ గతేడాది హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత అనేక సందర్భాల్లో భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెట్టేందుకు ‘ఆ దేవుడే నన్ను కాపాడాడు’ అని ఆయనన్నారు. శ్వేతసౌధంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ఓ ఆధ్యాత్మిక గురువును సలహాదారుగా పెట్టుకున్నారు. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ స్పందిస్తూ స్వర్గానికి వెళ్లాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారని, ఇక్కడ ఉన్నవారంతా అదే కోరుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు