జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 శాతం అక్షరాస్యులుగా మార్చడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో అక్షర ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం అని, ఈ ఏడాది జిల్లాలో 1,25,578 మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం అన్నారు. ముఖ్యంగా జిల్లా / మండల / గ్రామ / వార్డు అధికారులందరూ అక్షర కేంద్రాలను సందర్శించి హాజరు శాతాన్ని పెంచి కార్యక్రమం సజావుగా నడిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 28 న జరిగే ఫ్రీ ఫైనల్ పరీక్ష మరియు మార్చి నెలలో జరిగే ఎఫ్ ఎల్ ఎన్ ఏ టి పరీక్షకు అందరు అభ్యాసకులు ఉత్తీర్ణులు కావాలని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, వయోజన విద్య ఉప సంచాలకులు సంపంగి వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం
- Advertisement -


